Karate Kalyani Slaps YouTuber Srikanth Reddy: సినీ నటి కరాటే కల్యాణి రాత్రి వేళ ఓ వ్యక్తిపై దాడి చేశారు. ప్రాంక్ వీడియోలు, అడల్ట్ కంటెంట్‌తో వీడియోలు తీసుకొనే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడిని కల్యాణి చెంపపై కొట్టారు. అతని వీడియోల్లో మహిళలను తక్కువ చేసి చూపుతున్నాడని, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తున్నాడని కరాటే కల్యాణి ఆరోపించారు. అందుకే అతణ్ని కొట్టినట్లు వివరించారు. అయితే, కల్యాణి శ్రీకాంత్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె మొత్తం ఆ తతంగాన్ని ఫేస్ బుక్ లైవ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.


తొలుత రోడ్డుపై వీడియోలు తీసుకుంటున్న అతని దగ్గరికి కరాటే కల్యాణి వచ్చి చెంపదెబ్బ కొట్టింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఆమెను తిరిగి కొట్టడంతో గొడవ మరింత ఎక్కువ అయింది. నడి రోడ్డుపైనే ఈ రచ్చ రచ్చ జరగడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు. ఇంతలో ఆమె వెనకాలే ఉన్న మరో వ్యక్తి వేగంగా వచ్చి శ్రీకాంత్ చెంప పగలగొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన శ్రీకాంత్ కరాటే కల్యాణిపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో కరాటే కల్యాణి ఓ పసి బిడ్డను ఎత్తుకుని ఉన్నారు. ఈ గొడవలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. 


నీకు అక్కా చెల్లెళ్లు లేరా? ఒక ఆడదానిగా నువ్వు చేస్తున్న అసభ్య వీడియోలు భరించలేకనే వచ్చా. ఇవాళ నీ సంగతి ఏంటో చూస్తా.. పోలీసులతో కొట్టిస్తా. శ్రీకాంత్‌ని చావగొట్టా. అతడి గుడ్డలూడదీసి కొట్టా.. అతని గురించి మీరేం మాట్లాడరా? మీరు సమాజంలో బతకట్లేదా? ఆడ పిల్లను నేను బయటికొచ్చి మాట్లాడుతుంటే మీరు చోద్యం చేస్తున్నారేంటి? సిగ్గు, లజ్జ లేదా? వీడికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టిస్తా’’ అంటూ కల్యాణి చుట్టుపక్కల ఉన్నవారితో అన్నారు. నువ్వు చేస్తున్న వీడియోలకి హిందువులంతా మూసుకొని కూర్చొంటారా అంటూ కల్యాణి మండిపడ్డారు. ఈ క్రమంలో అతణ్ని బూతులు తిట్టారు. అందరూ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి ఇల్లు ఖాళీ చేయిస్తానని హెచ్చరించారు. ఈ గొడవ అనంతరం ఒకరిపై ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 


మరోలా శ్రీకాంత్ రెడ్డి వాదన
కరాటే కల్యాణి తనకు కొట్టినందుకు కారణం తాను ఆమె అడిగిన డబ్బులు ఇవ్వనందుకే అని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వాదించారు. తనను రూ.లక్ష అడిగిందని, తాను ఇవ్వను అన్నందుకే ఇలా దాడికి పాల్పడిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తాను ప్రాంక్ షూట్స్ చేస్తే ఆమెకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు.మధ్యలో మరో వ్యక్తి వచ్చి ఆమెకు రూ.70 వేలు ఇవ్వాలని మధ్యవర్తిత్వం వహించినట్లుగా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.