Telangana High Court: బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్‌పై విజయం సాధించిన దానం నాగేందర్(Danam Nagender) ఈ మధ్య కాలంలో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం(Khairatabad Assembly constituency) నుంచి గతేడాది జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, దీప్‌దాస్‌మున్షీ నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 


కాంగ్రెస్‌లో చేరిన దానం 


దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించి ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో చేరడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిల్ వేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి... రాజీనామా చేయకుండా పార్టీ మారడం చట్ట విరుద్దమని అందుకే చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో  రాజు పేర్కొన్నారు. 


స్పీకర్‌ను ఆదేశించాలని కోర్టులో పిల్


దానంపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని హైకోర్టుకు విన్నవించారు. అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. దీన్ని విచారణకు హైకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 


కాంగ్రెస్‌లో కూడా విమర్శలు 


కారు గుర్తుపై ఖైరతాబాద్‌ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్‌... ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తర్వాత సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. అవకాశ వాదులకు పదువులు ఇవ్వడం మంచి సంకేతాలు కావని కామెంట్ చేస్తున్నారు. దానం చేరిక అటు కాంగ్రెస్‌ ఇటు బీఆర్‌ఎస్‌లో కూడా విమర్శలు కారణమైంది. 


దానంపై ఫైర్ అయిన కేటీఆర్‌ 


సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై రివ్యూ చేసిన బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. దానం నాగేందర్ పచ్చి అవకాశవాది అని ఆరోపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే వాళ్లే నిజమైన నాయకులు అని అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి వచ్చి వెళ్లిపోయే వాళ్లను ప్రజలు నమ్మబోరని అన్నారు. 


న్యాయపోరాటం చేస్తామని ప్రకటన 


దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసే వరకు పోరాడుతామన్నారు కేటీఆర్. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టుల్లో కేసులు వేస్తామన్నారు. కచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడుతుందని చెప్పుకొచ్చారు కేటీఆర్. 


కేసీఆర్‌ను చుట్టపక్కల వాళ్లే చెడగొడుతున్నారన్న దానం 


కేటీఆర్‌ చేసిన విమర్శలపై దానం నాగేందర్ కూడా ఘాటుగా రియాక్ట అయ్యారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు పనులే చేయలేదని అలా అని నిరూపించాలని సవాల్ చేశారు. కేసీఆర్ గొప్ప నాయకుడేనని కానీ ఆయన పక్కన ఉన్న వాళ్లే చెడగొడుతున్నారని కామెంట్ చేశారు. తాను కచ్చితంగా సికింద్రాబాద్‌లో విజయం సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చారు. 


న్యాయపోరాటానికి సిద్ధమని దానం ప్రకటన 


తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌కు అది సాధ్యం కాదన్నారు దానం. దీనిపై న్యాయపోరాటం చేస్తనన్న కేటీఆర్‌కు సవాల్‌గా తాను కూడా న్యాయపోరాటం చేస్తాను అన్నారు.