Cheriyal Scroll Paintings: సినిమాలు ఈ ప్రపంచానికి పరిచయం కాక ముందు, నాటకాలు, వీధి భాగోతాలు, ఒగ్గు కథలు ప్రజలకు ప్రధానంగా తెలిసిన జానపద సాహిత్యాలు. కానీ ఈ కళలకు దృశ్యరూపం ఇచ్చింది ఎవరు? ఆ దృశ్యరూపాలు కంటికి కనబడేటట్లు తీర్చిదిద్దిన వారు ఎవరు? వారే నకాశీ కళాకారులు! తెలంగాణ ప్రాంతంలోని చేర్యాల టౌన్‌కు చెందిన నకాశీ కళాకారులు చిత్రీకరించే చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కళలో పురాణాలు, జానపద కథలు, కుల చరిత్ర ఘట్టాలను ఒక బట్ట పై రంగులతో చిత్రీకరించి, వాటి ఆధారంగా కథలను ప్రేక్షకులకు చెబుతారు. ఈ చిత్రాలను గీసే వారిని 'నకాశీలు' అని పిలుస్తారు.
నకాశీ కళాకారులు: తర తరాల వారసత్వం
సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల గ్రామం ఈ నకాశీ కళకు పుట్టినిల్లు. ఈ గ్రామంలో నివసించే కొందరు కళాకారులు (Nakashi Artists) ఈ కళను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 13 వ శతాబ్దం లో అవతరించిన నకాశీ కళ ను నూతన ప్రపంచానికి పరిచయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్న కుటుంబాలలో నకాశీ వైకుంఠం గారి కుటుంబం ఒకటి. వంశ పారంపర్యం గా వస్తున్న నకాశీ కళ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుగా 2009 లో హైదరాబాద్ కు తమ కుటుంబం తో పాటు వచ్చి స్థిరపడ్డారు
వైకుంఠం కుటుంబం ఇప్పుడు ఈ కళను భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు కృషి చేస్తోంది. ఆయన భార్య, ఇద్దరు కుమారులు కూడా ఈ కళను కొనసాగిస్తున్నారు.
"మా తాత గారు, వారి తాత గారు, వారికి ముందు తరాలు కూడా ఈ నకాశీ కళను అభ్యసించారు. ఈ కళను నేటికి కొనసాగిస్తున్న కుటుంబాలలో మా కుటుంబం ఒకటి," అంటారు ప్రముఖ నకాశీ కళాకారులు, జాతీయ పురస్కార గ్రహీత డి. వైకుంఠం గారు. ఆయన కుమారుడు డి. రాకేష్ ఏడేళ్ల వయసు నుండే ఈ కళను అభ్యసిస్తున్నాడు. "మా కథలలో సామాజిక అంశాలు, పౌరాణికాలు, ప్రజల జీవన విధానాల చుట్టూ తిరుగుతాయి. కాలక్రమేణా మా కళలో ఆధునిక సమాజానికి అనుగుణంగా మార్పులు తీసుకురావడం జరిగింది,” అని వైకుంఠం తెలిపారు.
వీరు స్క్రోల్ పెయింటింగ్స్‌తో పాటు వాల్ పెయింటింగ్స్, మట్టి శిల్పాలు, ఫాబ్రిక్ పెయింటింగ్స్ కూడా చేస్తారు. ఈ కళలో ఉపయోగించే రంగులు పచ్చ, ఎరుపు, నీలం వంటి సహజ రంగులు. వీటిని ప్రాథమికంగా చెరువులోని రాళ్ళు, చింత చెట్ల నుండి తీసిన బంక, నాటుకాయలు ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు, తేనె కలిపి మరింత ప్రామాణికమైన రంగులు ఉత్పత్తి చేస్తారు.
సాంకేతిక విప్లవం వల్ల సవాళ్లు:
సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో పాటు, నూతన ట్రెండ్స్‌కి అనుగుణంగా కాంటెంపరరీ పెయింటింగ్ స్టైల్స్ అందుబాటులోకి రావడం వల్ల, శతాబ్దాల చరిత్ర కలిగిన నకాశీ కళకు ఆదరణ తగ్గిపోతోంది. అయినప్పటికీ, నకాశీ కళాకారులు వివిధ అంశాలకు సంబంధించిన చిత్రపటాలను వేసి కొన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శిస్తున్నారు.
ప్రభుత్వం సహకారం ఉంటే మరింత అభివృద్ధి:
నకాశీ కళ ను భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరుతున్నారు నకాశీ కళాకారుల. ప్రభుత్వం వీరికి వర్క్ స్పేస్‌లు ఏర్పాటు చేసి, పెయింటింగ్ కోసం కావలసిన రా మెటీరియల్స్ సులభంగా అందుబాటులోకి తెస్తే, ఈ కళను మరింత ప్రజలకు చేరువ చేయవచ్చు. "ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఈ కళను ప్రోత్సహిస్తే, నకాశీ కళ గొప్పతనం ప్రపంచానికి మరింత చేరుతుందని" వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: 600 Years Old Bidri Art: పర్షియా నుంచి బీదర్, అటు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అపురూప హస్త కళ బిద్రి