600 Years Old Bidri Art: 600 ఏళ్ళ చరిత్ర కలిగిన బిద్రి కళ హైదరాబాద్ డెక్కన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ హస్తకళల్లో ఒకటి. ఇది 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల కాలంలో కర్ణాటక లోని బీదర్‌ ప్రాంతంలో పుట్టుకొచ్చింది. పర్షియన్ కళాకారులు ఈ కళను భారతదేశానికి పరిచయం చేశారు. బిద్రి కళలో బ్లాక్ మెటల్‌పై వెండి లేదా బంగారాన్ని పొదిగించి కళా వస్తువులు తయారుచేస్తారు. ప్రత్యేకంగా పుష్పాలు, చారిత్రక మోటిఫ్‌లు, మొఘల్ డిజైన్లు ఈ కళలో ప్రధానంగా కనిపిస్తాయి. బీదర్ కోటలో దొరికే ప్రత్యేక మట్టి వాడడం వల్ల బిద్రి కళతో తయారు చేసిన వస్తువులకు మెరుగైన నాణ్యత లభిస్తుంది.


ఈ కళ బహమనీ సుల్తానుల కాలంలో ప్రారంభమైనప్పటికీ నిజాం వంశీకుల అండతో మరింత విస్తరించింది. రాజరికాల కాలంలో నవాబులు, రాజులు బిద్రి కళతో తయారు చేసిన వస్తువులను విశేషంగా ప్రోత్సహించేవారు. ప్రత్యేకంగా వెండి చాముర్లు, ఆభరణాల పెట్టెలు, అరబిక్ కాలిగ్రఫీతో చేసిన కళా వస్తువులు విలువైన వారసత్వ సంపదగా నిలిచాయి.


ప్రస్తుత పరిస్థితి:


నవాబుల కాలంలో విరివిగా ఉన్న ఈ కళకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతోందని కొందరు బిద్రి కళాకారులు చెబుతున్నారు. వెండి ధరలు పెరిగి, మార్కెట్ పరిస్థితులు కష్టతరం కావడంతో కళాకారులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాక, బీదర్ ప్రాంతంలో లభించే ప్రత్యేక మట్టిని పొందడం కూడా కష్టతరమైంది.


హైదరాబాద్‌ లోని పూరానీ హవేలీ ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ ఈ కళను కొనసాగించే కొద్దిమంది కళాకారుల్లో ఒకరు. నిజాం నవాబుల కాలంలో కొన్ని వందల కుటుంబాలు ఈ కళను తమ కుల వృత్తిగా కొనసాగించేవి. కానీ కాల క్రమేణ, హైదరాబాద్‌ లో ఈ వృత్తికి ఆదరణ తగ్గింది. "నేను మా తాతగారి వద్ద ఈ కళ నేర్చుకున్నాను. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, వెండి ధరల పెరుగుదల వల్ల మా వృత్తి కష్టాల్లో ఉంది. అయినప్పటికీ నేను 10 మంది వర్కర్లకు పని కలిపిస్తూ ఈ వృత్తి ని కొనసాగిస్తున్నారు.  ప్రభుత్వ చొరవ తీసుకుని మా కష్టాన్ని గుర్తించి  మాకు తగు సహకారం అందించాలి. ప్రభుత్వ కార్యక్రమాలు, అవార్డు వేడుకల్లో మేము తయారు చెసే వస్తువులను కొనుగోలు చేసి మా వృత్తిని కొనసాగించడం లో మాకు ప్రోత్సాహం ఇవ్వాలి" అని ఖలీల్ చెబుతున్నారు.


బిద్రి పాత్రల తయారీలో రెండు రకాల మిశ్రమ లోహాలను వాడుతారు: కాపర్, జింక్ 1:16 నిష్పత్తిలో కలిపి వెండి లేదా బంగారాన్ని డిజైన్స్ లో పొడగించి బిద్రీ కళా వస్తువులను తయారుచేస్తారు. ఒకప్పుడు భారత హస్తకళల్లో ప్రముఖ స్థానం పొందిన బిద్రి కళ కాలక్రమేణ ఆదరణ తగ్గుతోంది. దీనితో దీని తయారీలో నిష్ణాతుల సంఖ్య కూడా తగ్గుతోంది.



దక్కని సాంస్కృతిక వారసత్వంగా నిలిచే బిద్రి కళను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఖలీల్ లాంటి కొందరు కళాకారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మరియు బీదర్ ప్రాంతాల్లో ఈ బిద్రి వర్క్‌ షాపులు ఉన్నాయి. పర్షియా నుండి ప్రారంభమై, బీదర్ మీదుగా హైదరాబాద్ వరకు వచ్చిన ఈ కళ డక్కనీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికగా నిలుస్తుంది.


Also Read: 30 Crore JOB : లైట్ స్విచ్చాన్ చేసే ఉద్యోగం - ఏటా రూ.30 కోట్ల జీతం - ఇప్పటికీ ఖాళీ ఉంది ట్రై చేస్తారా ?