TG PGECET 2024 Final Counselling: తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 'టీఎస్ పీజీఈసెట్-2024' చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 23న ప్రారంభమైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 23 నుంచి 27 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఈమెయిల్ ద్వారా వెల్లడిస్తారు.
అభ్యర్థులకు సెప్టెంబరు 29, 30 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అక్టోబరు 1న ఆప్షన్ల సవరణకు అవకాశం ఇవ్వనున్నారు. తర్వాత సీట్ల కేటాయింపు వివరాలను కళాశాలలవారీగా అక్టోబరు 5న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సీట్లు పొందినవారు అక్టోబరు 7 నుంచి 10 మధ్య సంబంధిత కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదుతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో జూన్ 10 నుంచి 13 వరకు పీజీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2024 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 20,626 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పీజీఈసెట్ పరీక్ష ఫలితాలను జూన్ 18న ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్ష రాసినవారిలో 18,829 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మడీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు కనీస అర్హత మార్కులు ఉండవు. అంటే ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు.
పీజీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 23.09.2024 to 27.09.2024
➥ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెల్లడి: 28.09.2024
➥ ఈమెయిల్ ద్వారా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం: 28.09.2024
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 29.09.2024 - 30.09.2024
➥ వెబ్‌ఆప్షన్ల సవరణ: 01.10.2024
➥ సీట్ల కేటాయింపు: 05.10.2024
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 07.10.2024 to 10.10.2024
మొదటి విడతలో 7,128 మందికి సీట్ల కేటాయింపు..
రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా-డీ(పీబీ) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 10,923 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోగా.. 7,128 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇందులో ఎంటెక్, ఎంఈలో 5,891 సీట్లకుగాను.. 4,330 మందికి సీట్లు కేటాయించారు. ఎంఫార్మసీ, ఎంఫార్మ్‌లో 3,395 సీట్లకుగాను.. 2,747 మందికి సీట్లు కేటాయించారు. ఎంఆర్క్‌లో 168 సీట్లకుగాను 51 మందికి సీట్లను కేటాయించారు. అన్ని కోర్సులు కలిపి మొత్తం 9,454 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబరు 23న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
TG PGECET-2024 Phase-2 Counselling Notification
Apply for online certificate verification-New Registration