2 BHK Housing Scheme: ప్రతి పనికిమాలినోడు డబుల్ బెడ్రూములు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారని.. వారికి కళ్లు కనిపించట్లేదా అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కమలానగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూము ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలినోళ్లు ఇళ్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారని, వారికి కళ్లు కనిపించడం లేదా అని తలసాని ప్రశ్నించారు.


‘‘ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు. వాడికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి. 58 జీవో ప్రకారం పేదవారి ఇళ్లు రెగ్యులరైజ్ చేసినం.. పింఛన్లు ఇస్తున్నాం.. డబుల బెడ్ రూములు కట్టిస్తున్నాం.. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ ఇస్తున్నాం’’ అంటూ మంత్రి మాట్లాడారు. డబుల్ బెడ్రూము ఇళ్లను పప్పు, బెల్లం లాగా ఎవరికి పడితే వారికి పంచడానికి లేదని మంత్రి అన్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర ఖర్చు అయ్యేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఒక్కో రెండు పడక గదుల ఇల్లు నిర్మించడానికి రూ. 9 లక్షలు ఖర్చు అవుతున్నట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని.. కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శలు గుప్పించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడాల్సిన పని లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.


మహిళపై మంత్రి ఆగ్రహం


ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ తలసానిని కోరారు. మహిళ విజ్ఞప్తిపై మంత్రి సరైన సమాధానం చెప్పకపోగా.. ఆమెపై సీరియస్ అయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఇల్లు కట్టిస్తున్నారా అని తిరిగి మంత్రి ఆ మహిళను ప్రశ్నించారు. మహిళ తనకు ఇల్లు కోరగా తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలసాని తీరు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.


17 కోట్ల అంచనాతో 210 డబుల్ బెడ్రూంల నిర్మాణం


విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూముల నిర్మాణాన్ని చేపట్టింది. మురికి వాడల్లో గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్రూములు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ లో దాదాపు 17 కోట్ల అంచనాతో 210 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది రాష్ట్ర సర్కారు. ఈ నిర్మాణ సముదాయాన్ని ఇవాళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 210 డబుల్ బెడ్ రూముల నిర్మాణానికి మొత్తంగా రూ. 16.27 కోట్లు ఖర్చు అయింది. రూ. 15.5 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. వాటర్ ట్యాంక్, విద్యుత్ సరఫరాతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా షట్టర్ లు నిర్మించారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి 'డిగ్నిటీ కాలనీ'గా నామకరణం చేశారు.