Hyderabad Airport Metro: హైదరాబాద్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లు నిర్మించాలని హైదారాబ్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ భావిస్తోంది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం కాగా ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జారీయ రహదారికి కొద్ది దూరంలో, విమానాశ్రయం టెర్మినల్ లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే వంపులు లేని చోట్ల స్టేషన్లు నిర్మిస్తారు. సమస్యలు ఉంటే మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా స్టేషన్ల మార్కింగ్ ఉండనుంది. మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఖరారు చేస్తారు. అయితే భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అలైన్ మెంట్ ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పాకూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్ పూర్ లోనూ ఓ స్టేషన్ నిర్మిస్తారట. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఓ స్టేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనావాసాలు పెరిగితే మరో స్టేషన్ ను కూడా నిర్మించే యోచనలో హెచ్ఏఎంఎల్ ఉంది. 


బుధవారమే ఎయిర్ పోర్టు మెట్రోకు గ్లోబర్ టెండర్ల ఆహ్వానం 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టర్ ఎంపిక కోసం హెచ్ఏఎంఎల్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ అంచనా రూ. 5,688 కోట్లు అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలపారు. ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, మెకానికల్, ఎలక్ట్రికల్, సరఫరా పనులను చేపట్టాల్సి ఉంటుంది. రోలింగ్ స్టాక్(రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటో మేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల పనులు చేపట్టాలి. ఎయిర్‌ పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులు అన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. భూ సామర్థ్య పరీక్షలు కూడా ఇప్పటికే సాగుతున్నాయి.



ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ వేర్వేరు


రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టుకు మొత్తం వ్యయం అంచనా రూ. 6,250 కోట్లు. అయితే ప్రస్తుతం మాత్రం రూ. 5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండింటి మధ్య తేడా గురించి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ వేర్వేరని చెప్పుకొచ్చారు ఎన్వీఎస్ రెడ్డి. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టీ మాడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవని.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయని తెలిపారు. అందుకే ప్రాజెక్టు వ్యయం, టెండర్ మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు.