New Electric Buses Launching : తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. రోడ్డు ట్రాన్స్ పోర్టు సంస్థ కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో 5వందల బస్సులు అందుబాటులోకి రానున్నాయి.  



అద్దె ప్రతిపాదికన 5వందల ఏసీ బస్సులు,  
అద్దె ప్రతిపాదికన తీసుకుంటున్న  5వందల ఎయిర్ కండిషన్డ్ బస్సులు...ఆగస్టు నాటికి ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఛార్జింగ్‌ కోసం బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో 33 కేవీ పవర్‌ లైన్లను ఆర్టీసీ తీసుకుంది. నగరంలోని అన్ని రూట్లలోనూ ఏసీ బస్సులు నడవనున్నాయి.  మరోవైపు ఆర్టీసీ సొంతంగా...565 డీజిల్‌ బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 140 ఆర్డినరీ బస్సులు,  125 మెట్రో డీలక్స్‌లు ఉండనున్నాయి. ఈ బస్సులన్నింటిలో మహిళలలు ఉచిత ప్రయాణించవచ్చు. 



ఆర్టీసీ చాలా ఆరోగ్యంగా ఉందన్న ఎండీ సజ్జనార్
ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను కేటాయించామన్నారు. హైదరాబాద్​-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను నడుపుతున్నామన్న ఆయన, ఆర్టీసీ చాలా ఆరోగ్యంగా ఉందని, దానికి కారణం ప్రభుత్వమేనని కొనయాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించినందుకు సీఎం, డిప్యూటి సీఎం, మంత్రులకి ధన్యవాదాలు చెప్పారు సజ్జనార్.  ప్రభుత్వం ఇప్పటికే చాలా కొత్త బస్సులు విడుదల చేసిందన్న ఆర్టీసీ ఎండీ, ఇప్పుడు మరో 22 కాలుష్యరహిత బస్సులు ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. కొత్త ప్రారంభించిన ఎలక్ట్రికల్ నాన్ ఏసీ బస్సులు మహలక్ష్మి పథకానికి అనుసందానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుండటంతో...ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిసిపోతున్నాయి.