World Blood Donor Day : ఏడాదికి ఒకసారి రక్తదానం చేసినా చాలు ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఇప్పటికే 151 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడంతో పాటు రికార్డు సృష్టించారు మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ లయన్ డా.అంబటి నటరాజు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై చేతుల మీదగా నటరాజు అవార్డు అందుకున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ మార్గంలోని సంస్కృతి హాల్ లో రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 151 సార్లు రక్తదానం చేసిన రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించిన రెడ్ క్రాస్ ఛైర్మన్ లయన్ నటరాజుకు గవర్నర్ అవార్డు ప్రదానం చేశారు.
108 మందితో నేత్రదానం
రెడ్ క్రాస్ ఛైర్మన్ గా మహబూబ్ నగర్ జిల్లాలో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 1,96,600 మందితో రక్తదానం చేసించిన నటరాజు 108 మందితో నేత్ర దానం సైతం చేయించారు. ప్రధానంగా లయన్స్ క్లబ్ ద్వారా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి 85 వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించారు. ముఖ్యంగా 16 పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించిన నటరాజు అందరిచే శభాష్ అనిపించుకున్నారు. అడుగడుగునా సామాజిక స్ఫూర్తి కలిగిన నటరాజు సేవలకు గతంలో సేవా రత్న అవార్డుతో పాటు అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా నాటి రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం, అప్పటి గవర్నర్ రంగ రాజన్ , గులాం నబీ ఆజాద్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. తాజాగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, రెడ్ క్రాస్ ఛైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, జనరల్ సెక్రటరీ కె.మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొని నటరాజును అభినందించారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం
రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి... అని ప్రజల్లో అవగాహన పెంచేందుకే ప్రత్యేకం ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’ ప్రారంభమైంది. రక్త దానం చేయడం ఎంత అవసరమో చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచఆరోగ్య సంస్థ 2004లో ఈ దినోత్సవాన్ని పెట్టాలని ప్రతిపాదించింది. 2005 నుంచి నిర్వహించడం మొదలుపెట్టింది.
ఈ రోజే ఎందుకు?
ఇదే రోజు నోబెల్ ప్రైజ్ అందుకున్న కార్ల్ లాండ్‌స్టీనర్ జన్మించాడు. 1868, జూన్ 14న పుట్టిన ఆయన శాస్త్రవేత్తగా ఎదిగి ABO బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టాడు. అంటే ఇప్పుడు మనం ఏ పాజిటివ్, ఏ నెగిటివ్,ఓ పాజిటివ్... ఇలా వర్గీకరించి మాట్లాడుతున్నామే, ఆ వ్యవస్థను కనిపెట్టింది శాస్త్రవేత్త ఈయన. అందుకే ఆయన పుట్టినరోజున గౌరవార్ధం ఈ ‘రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
ఎన్ని నెలలకోసారి రక్తదానం చేెయొచ్చు?
మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ సార్లు రక్త దానం చేయచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతుంటారు. అలాగే వారికి పీరయడ్స్ రూపంలో ప్రతి నెలా రక్తం బయటికి పోతుంది. మహిళలు ఆరు నెలలకోసారి రక్త దానం చేయచ్చు. అదే పురుషులైతే ప్రతి మూడు నెలలకోసారి చేయచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.