Kodali Nani Vs Purandeswari : వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి కొడాలి నాని అనూహ్యంగా బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరిపై ఘాటుగా విమర్శలు గుప్పించడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. హఠాత్తుగా గుడివాడ రాజకీయాలతో  కానీ... నేరుగా కేంద్ర ప్రభుత్వంతో కానీ సంబంధం లేకపోయినా ఎందుకు విమర్శలు చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గుడివాడలో కేంద్రం నిర్మించాల్సి ఉన్న ఫ్లైఓవర్ల కేంద్రంగా ఈ రాజకీయం నడుస్తోంది. అసలు ఈ ఫ్లైఓవర్లు ఏంటి ? పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఎందుకు అనుకుంటున్నారు ?


గుడివాడలో సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న సమస్య ఫ్లైఓవర్లు !


గుడివాడ  ప్రజలు ఎన్నో ఏళ్లుగా   రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు.  గుడివాడ పట్టణంలోని రెండు రైల్వే గేట్ల నుంచి పై నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణాం చేయాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నారు. అయితే అనేక రకాల సమస్యలతో అది పెండింగ్‌లో పడిపోయింది. ఇటీవల  రైల్వే శాఖ అనుమతితో కేంద్రం నుంచి ఫ్లైఓవర్‌ను మంజూరు చేసింది.  పామర్రు రోడ్డులో నిర్మాణం చేపట్టే బ్రిడ్జి పొడవు 2.5 కిలోమీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉండనుంది.  రూ.320 కోట్లతో  ప్రతిపాదనలు రెడీ చేశారు.  విజయవాడలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగానే గుడివాడ రైల్వే ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన జరిగింది.


కేంద్ర మంత్రి శంకుస్థాపన - పనులు ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో ఆరోపణలు !


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పనులు ప్రారంభం కాలేదు. హఠాత్తుగా ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపణలు చేస్తున్నారు.  నిజానికి పురందేశ్వరికి గుడివాడ ఫ్లైఓవర్లకు ఎలాంటి సంబంధం లేదు. కనీసం ఆమె గుడివాడ నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టలేదు. అంతే కాదు.. కేంద్రంలో కూడా ఎలాంటి పదవిలో లేరు. కేవలం బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. అయితే గుడివాడలో కొంత మంది వ్యాపారుల కోసం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పురందేశ్వరి అడ్డుకునేందుకు గడ్కరీ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని కొడాలి నాని చెబుతున్నారు. 


రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు, భూమి ఇచ్చారా ?


గుడివాడలో ప్లైఓవర్ కట్టాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లైఓవర్‌కు అవసరమైన భూమిని సేకరించాల్సి ఉంటుంది. అయితే మంత్రి కొడాలి నాని సూచన మేరకు ఫ్లైఓవర్‌ను పొడవును పెంచారు. దీని వల్ల పలువురు వ్యాపారుల ఆస్తులు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. భూమి సేకరించి ఇస్తే నిర్మాణం కేంద్రం చేపడుతుంది. కానీ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే పనులు ప్రారంభం కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్‌ను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించడంతో ఆ ఫ్లైఓవర్ ఆగిపోయిందేమో అన్న అనుమానం గుడివాడ ప్రజల్లో ఏర్పడుతోంది.