VRAs Protest :తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌లు (వీఆర్ఏ) సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వందలాది మంది వీఆర్ఏలు ఒక్కసారిగా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడి నిలువరించారు. పరిస్థితి అదుపుతప్పడంతో వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్టు చేశారు.  


వీఆర్ఏ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం 


అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగిన వీఆర్ఏ సంఘ నాయకులతో మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో సమావేశం అయ్యారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. వీఆర్ఏల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న సమయంలో వీఆర్ఏలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఆందోళనలు విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు. 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు.  


మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం 


ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. మంత్రి కేటీఆర్ పై తమకు నమ్మకం ఉందని, మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తితో సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 20 వరకు శాంతియుత నిరసనలు తెలుపుతామన్నారు. 


సీఎం కేసీఆర్ హామీలు 


వీఆర్ఏలకు పే స్కేల్‌ ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలుచేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని వీఆర్ఏ ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ  ఆ హామీలు అమలుకాలేదని వీఆర్ఏలు ఆందోళన బాటపట్టారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని వీఆర్ఏలు విమర్శలు చేస్తున్నారు. 


వీఆర్ఏల సమ్మెబాట 


సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగి నేటికి 51 రోజులు పూర్తయింది. వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అప్పటి నుంచి ప్రభుత్వం రూ. 10,500 గౌరవ వేతనం కూడా నిలిపేసింది. రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏలు అంటున్నారు. మరోవైపు ఉద్యోగం ఉంటుందో ఉండదో ఆందోళన చెందుతున్నామన్నారు. ఇప్పటి వరకూ 28 మంది వీఆర్‌ఏలు చనిపోయారని వీఆర్ఏ సంఘాలు అంటున్నాయి. 


Also Read : Telangana Assembly: కదం తొక్కిన వీఆర్ఏలు, అసెంబ్లీ ముట్టడికి యత్నం - భారీ లాఠీచార్జి, ఉద్రిక్తత


Also Read : VRA సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ