Telangana Revenue Assistant: తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌లు (వీఆర్ఏ) కదం తొక్కారు. వందలాది మంది వీఆర్ఏలు నేడు (సెప్టెంబరు 13) అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అసెంబ్లీ ఎదుట ప్రధాన రహదారి మూసేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి అసెంబ్లీ వైపునకు భారీ సంఖ్యలో దూసుకొచ్చిన వీఆర్ఏలు అసెంబ్లీ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారి తాకిడిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో వారిపై లాఠీ చార్జి చేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో వీఆర్ఏల నుంచి ప్రతిఘటన ఎదురై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.


కాంగ్రెస్‌ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరారు. ఇటు ట్యాంక్‌ బండ్‌, రవీంద్రభారతి, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పే స్కేల్‌ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పే స్కేల్‌పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.


 రూ.2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటూ ఆ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఫిషరీష్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా వచ్చారు. నిరసనకారులతో పాటు ముట్టడికి వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ చేపల టెండర్లను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని ఆందోళన చెందారు. తెలంగాణ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 


చర్చలకు పిలిచిన మంత్రి కేటీఆర్
వీఆర్ఏల ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న వారిలో కొంత మందిని అసెంబ్లీ ప్రాంగణంలోనికి పిలిచారు. ఈ క్రమంలో కేటీఆర్ వారికి సర్ది చెప్పారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని కేటీఆర్ అన్నారు. వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు. 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.