Air India: టాటా గ్రూప్ చేతిలో పడ్డాక, ఎయిర్ ఇండియా (Air India) దశ మారుతోంది. మరో 15 నెలల్లో 30 విమానాలను తన ఫ్లీట్‌లో యాడ్ చేసుకోవాలని ఈ కంపెనీ భావిస్తోంది.
ఈ ఏడాది జనవరిలో, ఈ ఎయిర్‌లైన్‌ను టాటాస్ స్వాధీనం చేసుకున్నారు. అప్పట్నుంచి చూస్తే, మహారాజాలో (Air India) ప్రస్తుతం చేపట్టిన విస్తరణ మొదటిది అవుతుంది.
ఈ డిసెంబర్ నుంచి, దశల వారీగా 30 కొత్త విమానాలను ఎయిర్ ఇండియా లీజుకు తీసుకోవాలని అనుకుంటోంది. వీటిలో 25 ఎయిర్‌బస్ A320 విమానాలు, మరో ఐదు బోయింగ్ 777 లాంగ్ రేంజ్ (LR) వెర్షన్ విమానాలు. వచ్చే 15 నెలల్లో వీటన్నింటినీ లీజుకు తీసుకోనుంది.
కొత్త B777 విమానాల్లో ప్రీమియం ఎకానమీ క్లాస్ సేవలను కూడా ప్రారంభించనుంది. దీనికితోడు, 16 లాంగ్ గ్రౌండెడ్ AI విమానాలు (10 సింగిల్ + 6 ట్విన్ ఐల్స్ ) కూడా తిరిగి సేవల్లోకి వస్తాయి.
B777-200 LR విమానాలు ఈ ఏడాది డిసెంబర్ - వచ్చే ఏడాది మార్చి మధ్య ఫ్లీట్‌లో చేరతాయి. వీటిని భారతీయ మెట్రో నగరాల నుంచి నేరుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్లే మార్గాల్లో తిప్పుతారు. ఈ విమానాల ద్వారా, మొదటిసారిగా ప్రీమియం ఎకానమీ హాల్ ఫ్లైట్‌లను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసుకువస్తోంది.
25 సింగిల్ ఐల్స్‌లో నాలుగు A321 విమానాలు ఉన్నాయి, ఇవి వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్ ఇండియా చేతికి వస్తాయి. మిగిలిన 21 A320 విమానాలు 2023 ద్వితీయార్థంలో ఫ్లీట్‌లో చేరతాయి. ఈ విమానాలను దేశీయ గమ్యస్థానాలతో పాటు, స్వల్ప దూర అంతర్జాతీయ గమ్యస్థానాల మధ్య కూడా మోహరిస్తారు.
ఆరంభం మాత్రమే..
చాలాకాలం పాటు పెద్ద స్థాయి వృద్ధి లేకుండా స్తబ్దుగా ఉన్న ఎయిర్ ఇండియా తిరిగి ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉందని; ఎయిర్ ఇండియా దగ్గర అద్భుతమైన విస్తరణ & పునరుద్ధరణ ప్రణాళికలు ఉన్నాయని, వీటిలో ఈ కొత్త విమానాలు ప్రారంభం మాత్రమేనని ఎయిర్‌లైన్స్ CEO & MD క్యాంప్‌బెల్ విల్సన్ వ్యాఖ్యానించారు.
ఎయిర్ ఇండియా నారో బాడీ ఫ్లీట్‌లో ప్రస్తుతం 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో 54 సర్వీసులో ఉన్నాయి; మిగిలిన 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2023 ప్రారంభంలో క్రమంగా సేవల్లోకి తిరిగి వస్తాయి. అదేవిధంగా, ఎయిర్ ఇండియా వైడ్ బాడీ ఫ్లీట్‌లో ప్రస్తుతం 43 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో 33 పనిచేస్తున్నాయి. మిగిలినవి 2023 ప్రారంభంలో తిరిగి సేవల్లోకి వస్తాయి.
ముంబై-శాన్ ఫ్రాన్సిస్కో నాన్‌స్టాప్‌లు
వచ్చే మార్చి నాటికి, ముంబై - శాన్ ఫ్రాన్సిస్కో నాన్‌స్టాప్‌లను ఎయిర్ ఇండియా ప్రారంభించనుంది. అంతేగాక, అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రాంతంలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలయిన నెవార్క్ లిబర్టీ & జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్‌పోర్ట్‌లకు కొత్త విమానాలను కనెక్ట్ చేస్తుంది.
బెంగళూరు నుంచి వారానికి మూడుసార్లు నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోకు విమానాలను మోహరిస్తుంది. టాటాలు తీసుకున్న నిర్ణయంతో, మరిన్ని దేశీయ & అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్
కొవిడ్ కారణంగా విధించిన ప్రయాణ ఆంక్షలను చాలా దేశాలు రద్దు చేసిన నేపథ్యంలో, గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు & ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నాయి, కొవిడ్ పూర్వ దశకు చేరాయి. విమాన ప్రయాణాల్లో రష్ ఇంకా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విస్తరణ బాట పట్టింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్‌కు కూడా ప్రస్తుత పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.