Amit Shah Tour : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్ చేరుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కీలక నేతలు... అమిత్ షాకు స్వాగతం పలికారు. చేవేళ్ల పార్లమెంట్‌ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. అమిత్‌ షా సభను గ్రాండ్ సక్సెస్‌ చేసేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.  బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నోవోటెల్ కు వెళ్లిన అమిత్ షా.. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికల అనంతరం అమిత్‌ షా తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.  


షెడ్యూల్ లో లేని మీటింగ్  


 శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమిత్ షా నోవాటెల్ కు వెళ్లారు.  నోవాటెల్ హోటల్ లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. అయితే ఈ మీటింగ్ షెడ్యూల్ లో లేదు.  బీజేపీ నేతలతో సమావేశం తరువాత అమిత్ షా నేరుగా చేవెళ్లకు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు. చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తుంది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. దాదాపు గంట పాటు చేవెళ్ల సభలో అమిత్‌ షా ప్రసగించనున్నారు. 


అమిత్ షా టూర్ షెడ్యూల్ 


పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో చేవెళ్ల చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు సభ ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి పయనం అవుతారు. విజయ సంకల్ప సభకు సంబధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. 


పలు మార్గాల్లో ఆంక్షలు


ఈ క్రమంలోనే చేవెళ్ల బహిరంగ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా ఈ సభ జరుగుతుండడం వల్ల నగరం నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం అమిత్ షా శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో చేవెళ్లకు రానున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. అదే విధంగా సభా స్థలి వద్ద కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం నాలుగు చోట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.