Traffic Challan Discount: వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు విధించిన జరిమానాల(Traffic Challan)పై ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) భారీ రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుంది. పెండింగ్‌ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు ఆన్‌లైన్‌ లోక్‌అదాలత్‌ ద్వారా రాయితీలను ఉపయోగించుకోవచ్చు. రాయితీ మినహా మిగిలిన జరిమానా మొత్తాన్ని చెల్లించాలి. వాహనదారులకు చలాన్లు భారంగా మారడం, పెండింగ్ చలాన్లు కూడా రూ.1250 కోట్లకు పైగా ఉండడంతో వీటిని వసూలు చేసేందుకు పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి చలాన్లను ట్రాఫిక్‌ పోలీస్, తెలంగాణ పోలీస్‌ ఈ-చలాన్‌(E-Challan) వెబ్‌సైట్ల ద్వారా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూంలోని ట్రాఫిక్‌ కాంపౌండింగ్‌ బూత్‌ ద్వారా చలాన్లు కట్టేందుకు పోలీసులు అవకాశం కల్పించారు. వాహనదారులు తమ పెండింగ్‌ చలాన్లు చెల్లించేందుకు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ఆ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ లోక్‌ అదాలత్‌ ఆప్షన్ యాడ్ చేయనున్నారు. పెండింగ్‌ చలానాలు చెల్లించేవారు ఆన్‌లైన్‌ లోక్‌ అదాలత్‌ ఆప్షన్ ఎంచుకుంటే జరిమానాల మొత్తం రాయితీ పోగా మిగిలిన సొమ్ము చూపిస్తుంది. 


85 శాతం చలాన్లు బైక్ లు, ఆటోలపైనే


హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Hyderabad Trafic Police ) నగర వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ట్రాఫిక్ చలాన్లను కట్టేందుకు భారీ రాయితీ ( Discount ) కల్పించారు. ఇప్పటి వరకూ వాహనాలపై ఉన్న చలాన్లు మొత్తం చెల్లిస్తే 75 శాతం రాయితీ ఇస్తారు. కార్లకు 50 శాతం,  బస్సులకు 70 శాతం రాయితీ ఇచ్చారు.  మార్చి నెల మొత్తం తగ్గింపుతో చెల్లించి చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక తోపుడు బండ్లపై నమోదు చేసిన చలాన్లకు ఇరవై శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆన్ లైన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలోని బూత్ లలో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. 85 శాతం చలాన్లు ద్వి చక్ర వాహనాలు, ఆటోలపైనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  


హైదరాబాద్ పరిధిలో వర్తింపు


కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగిన కారణంగా వాహనదారులకు ఉపసమనం కల్పించేందుకు ఈ డిస్కౌంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రాఫిక్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మార్చి ఒకటి నుంచి చలానా ( Challan Link ) చెల్లింపునకు సంబంధించిన లింక్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ అవకాశం హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లకు మాత్రమే వర్తిస్తుంది. కరోనా కారణంగా ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తున్నారు కానీ ఎవరూ కట్టడం లేదు. ఈ కారణంగా సుమారు రూ.1250 కోట్ల చలాన్ల రూపంలో పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.