Jaggareddy : కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలకు పెట్టింది పేరు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy), సీనియర్లకు అస్సలు పడడంలేదు. సీనియర్లకు విలువ ఇవ్వడంలేదని పార్టీ విధేయుల భేటీ పేరిట సమావేశం జరిగింది. వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి, పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న విషయాలపై ఈ నేతలు చర్చించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేయడంపై ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి వీలు దొరికినప్పుడల్లా రేవంత్ పై విరుచుకుపడుతుంటారు. గతంలో రేవంత్ రెడ్డిపై అధిష్టానికి ఓ లేఖ కూడా రాశారు. పార్టీలో రేవంత్ వర్గానికి, జగ్గారెడ్డికి వార్ నడుస్తోంది. దీంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఎందుకో ఆలోచన మార్చుకున్నారు.
అధిష్ఠానానికి లేఖతో
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అదనంగా ఉన్న బాధ్యతలను టీపీసీసీ తొలగించింది. గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి తాను స్వతంత్రంగా ఉంటానని చెప్పారు. దీంతో ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి, ఎన్ఎస్ యుఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్(Youth Congress) బాధ్యతలను మిగతా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లకు టీపీసీసీ అప్పగించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.
ఆ పదవుల నుంచి జగ్గారెడ్డిని తప్పించిన టీపీసీసీ
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి)ని కాంగ్రెస్ పార్టీ పదవుల నుంచి తప్పించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డిని అదనపు పదవుల నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పించింది. టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జగ్గారెడ్డి వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. తాను స్వతంత్రంగా ఉంటానని జగ్గారెడ్డి ప్రకటించిన నేపధ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతల్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, మహేష్‌గౌడ్‌లకు అప్పగించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.