సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని డైరెక్ట్ గా హీరోకి చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో సమయానికే అలా చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలదు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం నేరుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లి అతడు నటించిన సినిమా ఫ్లాప్ అని చెప్పారట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా చెప్పారు. అప్పటివరకు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నిర్మాత దిల్ రాజు స్పీడ్ కి బ్రేక్ వేసింది 'మున్నా' సినిమా. 


వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. దిల్ రాజు రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటనే సంగతి దిల్ రాజుకి మొదటి షోకే తెలిసిపోయిందట. ఆ విషయాన్ని నేరుగా వెళ్లి ప్రభాస్ కి చెప్పేశానంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దిల్ రాజు. 


నిజానికి 'మున్నా' సినిమా స్క్రిప్ట్ దగ్గరే తనకు ఇబ్బందిగా అనిపించిందని.. కానీ వంశీ పైడిపల్లి వాదించాడని చెప్పారు దిల్ రాజు. రైటర్ కొరటాల శివ కూడా బాగుందని చెప్పడంతో.. తగ్గానని అన్నారు దిల్ రాజు. రిలీజ్ రోజు మొదటి షో చూసి.. ఆ తరువాత డైరెక్ట్ గా ప్రభాస్ దగ్గరకు వెళ్లానని.. ఆ సమయంలో ప్రభాస్ వాళ్ల ఫ్రెండ్స్ హిట్ కొట్టేశామని ఆనందంలో ఉన్నారని గుర్తు చేసుకున్నారు దిల్ రాజు. 


డైరెక్ట్ గా ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. హిట్ ఇవ్వలేకపోయాను సారీ అని చెప్పారట దిల్ రాజు. దానికి ప్రభాస్, అతడి ఫ్రెండ్ షాక్ అయ్యారట. ప్రభాస్ బాగుందని వాదించినా.. తను ఒప్పుకోలేదని.. 'మున్నా' ఏవరేజ్ సినిమా అని చెప్పానని దిల్ రాజు తెలిపారు. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. 9 సెంటర్లలో వంద రోజులు ఆడిందని చెప్పారు దిల్ రాజు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ వీలైనంత త్వరగా అతడితో సినిమా ఉంటుందని ప్రకటించారు దిల్ రాజు. 


ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్'తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'ను కూడా ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని చూస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.