చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అపహరణ కేసు సుఖాంతంమైంది. సీసీ కెమెరాల ఆధారంగా గుంటూరులో పసికందుతో సహా కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకుని పసికందుని కిడ్నాపర్లు విశాఖపట్నానికి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అపహరణ కేసును చిత్తూరు టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏఎస్పి మహేష్ చెప్పన వివరాల ప్రకారం ఈ నెల 19వ తేదీన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో షబానాకు చెందిన ఐదు రోజుల మగబిడ్డను కిడ్నాప్ చేశారు దుండగులు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో టీమ్స్‌గా ఏర్పడి దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయన్నారు మహేష్.
సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసు ఛేదించినట్టు తెలిపారు చిత్తూరు పోలీసులు. విశాఖపట్నం జిల్లా, గంట్యాడ మండలం గాజువాకకు చెందిన పిల్లి పద్మ చెల్లెలు అయిన వరలక్ష్మి, నాగరాజు దంపతులకు పిల్లలు లేరు. వీళ్లు పిల్లలను కొనుగోలు చేసేందుకు చిత్తూరుకు చెందిన పవిత్రను కలిశారు. వీళ్లతో ఆమె 50 వేల రూపాయలకు ఒప్పందం చేసుకుంది.
నాగరాజు దంపతులతో చేసుకున్న ఒప్పందం నెరవేర్చేందుకు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ఈనెల 19వ తేదీన ఉదయం నాలుగు గంటల సమయంలో చిన్నపిల్లల వార్డులోని షబానాకు చెందినా ఐదు రోజుల మగబిడ్డను ఎత్తుకెళ్లింది. చేతిలో తీసుకెళ్తే అనుమానం వస్తుందని కట్టెల బ్యాగులో తీసుకెళ్లిందీ కిలాడీ. ఆసుపత్రి బయట ఉన్న పిల్లి పద్మ, పిండి వెంకటేష్‌కు అప్పగించిందా పిల్లాడిని.
చిన్నారిని తీసుకున్న నాగరాజు దంపతులు విశాఖపట్నం పెద్ద గంట్యాడ మండలనికి వెళ్లేందుకు విజయవాడలో బస్సు ఎక్కే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకుని బిడ్డను స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు పోలీసులు.
పోలీసులు పట్టుకునే క్రమంలో పిల్లి వరలక్ష్మి, నాగరాజు పరారయ్యారు. వారిద్దర్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో పట్టుకుంటామని చిత్తూరు ఏఎస్పి మహేష్ వెల్లడించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు కృషి చేసిన టూ టౌన్ పోలీసులను ఆయన అభినందించారు.