Revanth Reddy : ఆదివాసీలపై పోలీసులతో  సీఎం కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోడు సాగుదారులకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌, పోలీసులు ఆదివాసీలపైనే ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీ ఏం చేశాయో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  హైదరాబాద్ గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోదీ ఎన్నోసార్లు అవమానించారన్నారు. 


కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ 


కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలు దగాపడ్డారన్నారు. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వంతో కొట్టాడుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వారం రోజులుగా కేసీఆర్‌ దిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  రాష్ట్రంలో వరదలోస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్‌, భద్రాచలం ముంపు బాధితుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు.  ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ దిల్లీలో పర్యటిస్తు్న్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఇష్టరీతిన పెంచుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణలో తగ్గించలేదన్నారు.  వరదల వల్ల రూ.1400 కోట్లు నష్టం జరిగిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు స్పష్టమైన అంచనా వేయలేదన్నారు.  


చీకటి మిత్రులెవరు? 


క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ వెనక ఉన్న చీకటి మిత్రులెవరో తేల్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరారు.  స్టిక్కర్‌ పారేశానని బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. చికోటి ప్రవీణ్ వెనక ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు బయటకు వస్తున్నాయన్నారు. ఈడీ దాడుల్లో వెలుగు చూసిన ఆధారాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. మంత్రుల స్టిక్కర్లు చికోటి ప్రవీణ్ వద్ద దొరికినా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


మునుగోడును కాపాడుకుంటాం 


మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో బాధ్యత అంతా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ కంచుకోట మునుగోడును కాపాడుకుంటామన్నారు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్‌, కోమటిరెడ్డి వంటి బలమైన నేతలు ఉన్నారన్నారు. ఏదైనా సమస్య వస్తే కాంగ్రెస్‌ అప్రమత్తంగా ఉండి నేతలను కాపాడుకుంటుందని రేవంత్‌ అన్నారు.