Gururaj Pujari Wins Bronze: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. పురుషుల 61 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌లో పి.గురురాజా కాంస్యం సాధించాడు. హోరాహోరీగా జరిగిన పోటీలో 269 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 118, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 151 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.


కామన్వెల్త్‌లో గురురాజాకు వరుసగా ఇది రెండో పతకం కావడం గమనార్హం. పోటీ జరుగుతున్నంత సేపు అతడు రెండో స్థానంలోనే కొనసాగాడు. అయితే క్లీన్‌ విభాగంలో ఆఖరి ప్రయత్నంలో విఫలమవ్వడం రజతం అవకాశాలను దెబ్బతీసింది. అతడిడి కర్ణాటకలోని ఉడిపి జిల్లా. 61 కిలోల విభాగంలో అతడు స్టార్‌ లిఫ్టర్‌గా బరిలోకి దిగాడు.


బర్మింగ్‌హామ్‌లో తొలిరోజు భారత్‌కు పతకాలేమీ రాలేదు. రెండో రోజు వెయిట్‌ లిఫ్టర్లు వరుసగా రెండు పతకాలు అందించారు. మొదట 55 కిలోల విభాగంలో సంకేత్‌ మహాదేవ్‌ రజతం కొల్లగొట్టాడు. మరికొన్ని గంటలకే గురురాజా కాంస్యం అందించాడు. కాగా మలేసియాకు చెందిన అజ్నిల్‌ బిన్‌ బిదిన్ మహ్మద్‌ రెండు రౌండ్లలోనూ 285 కిలోలు ఎత్తి స్వర్ణం ముద్దాడాడు. కామన్వెల్త్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.


వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌ మరికొన్ని పతకాలను ఆశిస్తోంది. మహిళల విభాగంలో స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రాత్రి 8 గంటల తర్వాత బరిలోకి దిగనుంది. 49 కిలోల విభాగంలో పోటీ పడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే ప్రదర్శనతో ఆమె పతకం తీసుకురావాలని ఆశిస్తున్నారు.  55 కిలోల విభాగంలో బింద్యా రాణి పైనా అంచనాలు ఉన్నాయి.