సీఎం కేసీఆర్(CM KCR) ఇతర ముఖ్యమంత్రులను కలిసేందుకు వెళ్తున్న పర్యటనలు ఉద్దర ప్రకటనలే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) విమర్శించారు. గతంలో కూడా ఇలాంటి పర్యటనలు చేశారని, వాటితో ఉపయోగం లేదన్నారు. యూపీఏ(UPA) భాగస్వామ్య పక్షాలను చీల్చి కాంగ్రెస్ ను బలహీన పరిచి, మోదీకి మేలు చేయడమే సీఎం కేసీఆర్ హిడెన్ ఎజెండా అన్నారు. ఎన్డీఏ(NDA) భాగస్వామ్య పక్షాలను విడగొడితే కేసీఆర్ నిజంగానే మోదీని దించాలనుకుంటున్నారని భావించొచ్చన్నారు. మోదీ తరఫున సుపారీ గ్యాంగ్ కు సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్(KTR) మాత్రం ఆయన తండ్రి జన్మదినాన్ని ఉత్సవంగా చేసుకోమంటున్నారని విమర్శించారు.
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించినప్పుడు వారి దుఖఃం చూసి అందులో నుంచి వచ్చిన ఆవేదనతో వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ను విమర్శించానన్నారు. ఏం ఉద్ధరించారని కేసీఆర్ జన్మదినాన్ని(KCR Birthday) ఉత్సవాలుగా చేసుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, యువత మరణమృదంగం మోగుతోందని, ఉత్సవాలు చేసుకోమనడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్(Notification) ఇచ్చి, అప్పుడు ఉత్సవాలు చేసుకోమని చెప్పండన్నారు.
'మీ కుటుంబం బాగుంటే చాలా. పేదవాడు కష్టాల్లో ఉంటే పట్టదా. ప్రజలు బాధల్లో ఉంటే కేసీఆర్ జన్మదినాన్ని ఉత్సవాలుగా జరుపుకోమని చెప్పిన కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ప్రకటనలు చేయరన్నారు. నా మాటల్లో ఆత్మహత్య బాధిత కుటుంబాల ఆవేదన ఉంది. కేటీఆర్ మాటల్లో అధికార దర్పం ఉంది.' రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
అస్సాం ముఖ్యమంత్రి(Assam CM) హిమంత్ బిశ్వ శర్మ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. పోలీసులు తాను చేసిన ఫిర్యాదుకు ఇవాళ్టి ఉదయం వరకు ఎఫ్ఐఆర్(FIR) చేయలేదన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్స్ సంతృప్తి కరంగా లేవన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్ల వల్ల తన ఫిర్యాదు నిరుగారిపోతోందని వ్యాఖ్యానించారు. సెక్షన్లు సంతృప్తికరంగా లేవు కాబట్టి మళ్లీ ఫిర్యాదు చేశానన్నారు. మళ్లీ కొత్త ఎఫ్ఐఆర్ లో బలమైన సెక్షన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎఫ్.ఐ ఆర్ నమోదు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఇలాంటి నామమాత్రంగా కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విధంగా మాట్లాడిన హిమంత్ బిశ్వ శర్మ పై బలమైన కేసులు నమోదుచేయాలన్నారు. పోలీసులు(Police) కేసును నిరుగారిస్తే న్యాయస్థానంలో కొట్లాడుతామని స్పష్టం చేశారు.