తెలంగాణలో అధికార పక్షం విపక్ష నేతలపై మాటల దాడిని పెంచింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లక్ష్యంగా మంత్రి కేటీఆర్ వరుసగా ట్వీట్లు చేశారు. మంగళవారం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారని గుర్తు చేశారు. ఒక రాజనీతిజ్ఞుడిగా రాజీవ్ గాంధీ గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారని అన్నారు. పీసీసీ ‘చీప్’ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ జీ మీరు అత్యంత నీచమైన నాయకుడిని పీసీసీ చీప్‌గా ఎన్నుకున్నారు. అతను త్వరలోనే మంచిగా అవుతారని నేను ఆశిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన కూడా కేటీఆర్ సెటైరికల్‌గా స్పందించారు. బీజేపీకి అద్భుతమైన హాస్య నటుడు దొరికాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక వీళ్లు ఇంతకు మించి దిగజారర్లే అనుకునే సమయంలో కొత్త కమెడియన్ పుట్టుకొస్తున్నాడని ట్వీట్ చేశారు. ‘‘వారు ఇంతకు మించి దిగజారలేరు అని అనుకున్నప్పుడే.. మరో అద్భుతమైన హాస్యనటుడు పుట్టుకొచ్చాడు. మీరు బీజేపీకి ఓటు వేయకుంటే యూపీ సీఎం యోగి మీ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తాడు. అని ఈ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత అంటున్నారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బుధవారం రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్‌లో యూపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్‌డోజర్లను యోగి తెప్పించారు. ఎన్నికల తర్వాత.. యోగికి ఎవరెవరు ఓటు వేయలేదో వారిని అన్ని ప్రాంతాల్లో గుర్తిస్తారు. ఇప్పటికే వేల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్‌లు ఎందుకు యూపీ వైపు వస్తున్నాయో మీకు తెలుసు కదా!’’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకపోతే, మీరు యూపీలో ఉంటారో.. రాష్ట్రం విడిచిపోతారో తేల్చుకోండని హెచ్చరించారు. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్లు యూపీ విడిచి వెళ్లిపోక తప్పదని వీడియోలో చెప్పారు.