నెట్ ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ చూసి దాని స్ఫూర్తితో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ఓ గ్రూపును పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని గుంజపోగు సురేష్ గా పోలీసులు గుర్తించారు. అమ్మాయిలను ఎరగా వేసి.. టీనేజీ విద్యార్థులను ఆకర్షించి ఈ ముఠా కిడ్నాప్‌లకు పాల్పడుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని తాము అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది కాలంలో వీరు ఏకంగా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
నేరాలు ఇలా వెలుగులోకి..
పది రోజుల క్రితం నగరంలోని గుడిమల్కాపూర్‌లో ప్రాంతంలో ప్రశాంత్ అనే యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆయన కనిపించకపోవడంపై అతని సోదరి ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణ చేయగా.. నేరస్థుల అసలు గుట్టు బయటపడింది.
ముఠా నాయకుడిపై గతంలోనూ కేసులు
మెహెదీపట్నం సమీపంలోని అత్తాపూర్‌లో ఉంటున్న సురేశ్ అనే 27 ఏళ్ల వ్యక్తి గతంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ నేరాల్లో అరెస్టయి చాలా కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అలా రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు. ఆ క్రమంలో నెట్ ఫ్లిక్స్‌లో మనీ హెయిస్ట్ అనే వెబ్ సిరీస్ చూశాడు. అందులో చూపించినట్లుగా ప్రణాళికలు రచించి కిడ్నాప్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జనవరిలో మెహెదీపట్నంలోని భోజగుట్టలో నివాసం ఉంటున్న నిరుద్యోగులను రోహిత్, ఇందూరి జగదీశ్, కునాల్‌ను తన నేరాలకు ఉద్యోగులుగా నియమించుకున్నాడు. తెలివితేటలతో కాలేజీ విద్యార్థులు, టీనేజర్ల ఫోన్ నంబర్లు సేకరించాడు. ఓ యువతికి కూడా ఉద్యోగం ఇచ్చి విద్యార్థులు, టీనేజర్లకు వల వేసే పని ప్రారంభించాడు. ఫలానా చోటకు వారిని ఒంటరిగా రమ్మని చెప్పి కిడ్నాప్‌లు చేసేవాడు. ఇందుకోసం ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నాడు.
యువతి ఫోన్లో లేదా వాట్సప్‌లో మాట్లాడాక.. ఓ నిర్మానుష్య ప్రాంతానికి రావాలంటూ చెప్తారు. బాధితుడు రాగానే అప్పటికే కారులో ఉన్న రోహిత్, కునాల్ అతడిని మాయమాటలతో కారులో ఎక్కించుకుంటారు. బెదిరించి అతడి కుటుంబ సభ్యులకు డబ్బు కోసం ఫోన్ చేయిస్తారు. లేదంటే చంపేస్తామంటూ చెబుతారు. అతడి డెబిట్ కార్డులో నగదు వేయించి.. సమీపంలో ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటారు. బాధిత కుటుంబ సభ్యులు డబ్బులు తెచ్చే క్రమంలోనూ వీరు దొరక్కుండా పక్కా ప్రణాళిక వేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ కింద వీరు ఉండి పై నుంచి డబ్బును తాడుతో కిందికి వదలమని చెప్పేవారని వెల్లడించారు.