BRS Protest At Rajbhavan : హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాజ్ భవన్ వద్ద ధర్నాకు దిగారు. బండి సంజయ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు రాజ్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.  మహిళా నేతలకు రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 


రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత 


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఅర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ మహిళా నేతలు రాజ్ భవన్ వద్దకు వచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్టిల ఆధ్వర్యంలో నిరసన చేశారు. దీంతో రాజ్ భవన్ వద్ద పోలీసులను భారీ మోహరించారు.  చివరికి గవర్నర్  అపాయింట్మెంట్ దొరకక పోవడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్లు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు 


బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే 


 వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అడిగిన వెంటనే అపాయింట్మెంట్‌ ఇచ్చిన గవర్నర్‌ తమకు ఎందుకు ఇవ్వరని జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ తమిళి సై స్పందించాలని కోరారు. ఎమ్మెల్సీ కవితకే కాదని, మొత్తం మహిళా లోకానికే బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. సంజయ్‌ క్షమాపణ చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. మహిళా నేతలు పెద్ద ఎత్తున రాజ్ భవన్ వద్దకు చేరుకోవడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక దశలో మహిళలు రాజ్‌భవన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. గవర్నర్‌ అపాయింట్మెంట్‌ ఉంటేనే రాజ్ భవన్ లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో నిరసనకారులు వినతిపత్రాలను బారికేడ్లకు అంటించారు.  


బండి సంజయ్ పై కేసు నమోదు 


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌తో సహా హైద‌రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, మ‌హిళ‌లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ క‌విత‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన సంజ‌య్‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికే ప‌లు పోలీసు స్టేష‌న్లలో బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర  మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది.  తెలిపింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. 


తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు                          


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆరెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్ లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్ లో బీఆరెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో నిరసనలకు నాయకత్వం వహించారు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద,జూబ్లీ హిల్స్, పంజా గుట్ట వద్ద, ఢిల్లీలో బీఆరెస్ శ్రేణులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి.  హైదరాబాద్ లోని అనేక చోట్ల బీఆరెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆరెస్ మహిళా కార్యకర్తలు బండిసంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.