Direct tax collection: మన దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు, వ్యక్తిగతంగా ప్రజల ఆదాయాల మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 10 వరకు నమోదైన ప్రత్యక్ష పన్ను వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) విడుదల చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY 2022-23) మార్చి 10వ తేదీ నాటికి... దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను (Gross direct tax collection) వసూళ్లు రూ. 16.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 22.58 శాతం వృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది 96.67 శాతానికి సమానం. సవరించిన అంచనాల ప్రకారం 78.65 శాతంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సర్క్యులర్‌లో వెల్లడించింది.
పన్ను చెల్లింపుదార్లకు చెల్లించిన పన్ను వాపసుల (tax refunds) మొత్తాన్ని సర్దుబాటు చేసిన తర్వాత, మార్చి 10వ తేదీ వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net direct tax collection) రూ. 13.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ. 12.98 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 16.78 శాతం ఎక్కువ.
స్థూల ప్రత్యక్ష పన్నుల నుంచి రిఫండ్స్‌ను తీసేస్తే వచ్చే మొత్తాన్ని నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లుగా లెక్కిస్తారు.
కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు - వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు
విడివిడిగా చూస్తే... 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు, స్థూల ప్రాతిపదికన కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు (Corporate income tax collections) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.08 శాతం పెరిగాయి. ఇదే కాలంలో, స్థూల ప్రాతిపదికన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (Personal income tax collections) సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో (STT) కలిపి 27.57 శాతం పెరిగాయి.
నికర ప్రాతిపదికన (రిఫండ్‌లను తీసేసి) చూస్తే... కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 13.62 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20.73 శాతం మేర పెరిగాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను కూడా కలిపితే నికర వసూళ్లు 20.06 శాతం పెరిగాయి.
రూ. 2.95 లక్షల కోట్ల రిఫండ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 10వ తేదీ వరకు, మొత్తం రూ. 2.95 లక్షల కోట్ల పన్ను మొత్తాన్ని వాపసు (రిఫండ్) చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని రీఫండ్ మొత్తం కంటే ఇది 59.44 శాతం ఎక్కువ.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ. 14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుంది.