Ola Uber Ride Cancellation: 


ఫిర్యాదులు..


సిటీల్లో క్యాబ్‌ సర్వీస్‌లకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తరవాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను పక్కన పెట్టి అందరూ కార్లలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా క్యాబ్ సర్వీస్‌లకు ఇంకా డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఆ కంపెనీలు కూడా భారీగానే బాదుతున్నాయి. ఛార్జీలు పెంచేశాయి. వీటికి తోడు మరో సమస్య చాలా మంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. కారణం చెప్పకుండానే డ్రైవర్‌లు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. లొకేషన్ విషయంలోనూ డ్రైవర్‌లకు, ప్యాసింజర్స్‌కు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు చివరకు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ సమస్యగా ఎక్కువగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు..కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో..ఇలా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు అందించే ఏ సంస్థైనా సరే కస్టమర్స్‌కు కారణం చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు రైడ్‌లు క్యాన్సిల్ చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ రూల్‌ను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధిస్తారని వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మధ్యప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్. భోపాల్‌లో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నట్టు గమనించారు అధికారులు. 


జరిమానాలు..


కొన్ని సార్లు డ్రైవర్‌లు రైడ్ క్యాన్సిల్ చేసినా...ఆ మేరకు ఫైన్‌ను కస్టమర్సే చెల్లించాల్సి వస్తోంది. ఇది చాలా మందిని అసహనానికి గురి చేస్తోంది. అంతే కాదు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా రూ.100 వరకూ ఛార్జ్ చేస్తోంది. వీటితో పాటు క్యాబ్ సంస్థలకు మరి కొన్ని రూల్స్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఆంబులెన్స్‌ సహా అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు, ఓవర్‌ లోడింగ్‌కు రూ.200, లైసెన్స్ లేకుండా నడిపితే రూ.5,000 ఫైన్‌ విధించనుంది. అనవసరంగా హార్న్ కొట్టినా రూ.3 వేలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. 


హైదరాబాద్‌లోనూ.


హైదరాబాద్‌లోనూ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ డ్రైవర్లకు హెచ్చరికలు చేశారు. ప్రయాణికులు రైడ్‌ బుక్‌ చేస్తే క్యాబ్ ఆపరేటర్లు లేదా డ్రైవర్లు క్యాన్సిల్ చేయకూడదని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం - 1988లోని సెక్షన్‌ 178 కింద ఉల్లంఘన అవుతుందని వివరించారు. అలా చేసిన డ్రైవర్‌కు ఈ - చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రయాణికుల వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో వినియోగదారులు 94906 17346 అనే నెంబరుకు వాట్సాప్‌ నంబరులో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ఓలా, ఉబర్ సహా పలు క్యాబ్ సంస్థలపై గతేడాది కేంద్రం సీరియస్ అయింది. క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయని.. పీక్ అవర్స్, ఏసీ ఆన్‌ చేస్తే డబ్బులంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.


కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలైన ఓలా, ఉబెర్‌, జుగ్నూ, మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్‌ ప్రైసింగ్‌ అల్గారిథమ్‌, డ్రైవర్స్‌, పేమెంట్స్‌ స్ట్రక్చర్స్‌ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వచ్చాయి. కస‍్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం ఈ సమావేశంలో హెచ్చరించింది. 


Also Read: Viral Video: నేనెందుకు హిందీ మాట్లాడతా, ఇక్కడ కన్నడనే మాట్లాడాలి - ప్యాసింజర్‌తో ఆటో డ్రైవర్ వాగ్వాదం