Viral Video:


వైరల్ వీడియో..


కర్ణాటకలో ఓ ఆటో డ్రైవర్‌కు, ప్యాసింజర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు మహిళలు ఆటో ఎక్కారు. వాళ్లు హిందీలో మాట్లాడడం నచ్చని డ్రైవర్ గొడవకు దిగాడు. కర్ణాటకలో కన్నడలోనే మాట్లాడాలని, హిందీ ఎందుకు మాట్లాడుతున్నారని వాదించాడు. ఎక్కడ జరిగిందన్న స్పష్టత లేదు. అయితే ఆ మహిళా ప్యాసింజర్‌ ఆటో డ్రైవర్‌ వాదిస్తుండగా వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఓ యూజర్‌ దీన్ని పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయింది. మహిళపై ఆటో డ్రైవర్‌ గట్టిగా అరుస్తున్నాడు. "ఇది కర్ణాటక. మీకే కన్నడ మాట్లాడాలి. నేనెందుకు హిందీ మాట్లాడతాను" అని వాదించాడు. అందుకు ఆ ప్యాసింజర్ బదులిచ్చింది. "మేమెందుకు కన్నడ మాట్లాడాలి..?" అని ప్రశ్నించింది. దానికి బదులుగా "మీరు నార్త్ ఇండియా బెగ్గర్స్. ఇది మా నేల. మా ప్రాంతం. మీరు కన్నడలో మాత్రమే మాట్లాడాలి. నేనెందుకు హిందీలో మాట్లాడాలి..?" అని అన్నాడు ఆటో డ్రైవర్. ఇప్పటికే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన వారికి కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భాష తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన యూజర్.."ఇది కేవలం ఈ ఒక్క ఆటో డ్రైవర్‌ వైఖరి మాత్రమే కాదు. చాలా మంది ఇలానే వాదిస్తున్నారు. కర్ణాటకలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. కానీ బలవంతంగా ఇలా భాషను రుద్దాలనుకోడం మాత్రం సరికాదు" అని ట్వీట్ చేశాడు. కేంద్ర మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీలను ఈ ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు.  










అయితే ముందుగా నార్త్ ఇండియన్సే ఆ ఆటో డ్రైవర్‌ను హిందీ మాట్లాడాలని బలవంతం చేసి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయం హిందీయేనంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు మండి పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ వీడియోతో భాషా వివాదం తెరపైకి వచ్చింది.