నిండు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన వరకు... పురాణాల నుంచి ప్రస్తుత సమాజం వరకు... మహిళలు ఎన్నో, ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ మన సమాజంలో ఏదో ఒక చోటు, ఏదో ఒక మూల అమ్మాయిలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగిన ఘటనల గురించి వింటూ ఉన్నాం. ఆ ఘటనలకు కారణమైన, కారణం అవుతున్న మృగాళ్లను ప్రశ్నిస్తూ ఓ గీతం రూపొందింది.


చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, చరిష్మా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి పుష్ప‌క్‌, JBHRNKL స‌మ‌ర్ప‌కులు. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. ఆయన స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో 'ఎవరు నువ్వు' గీతాన్ని తాజాగా విడుదల చేశారు. 


''యుగాలుగా ఈ పుడమిపై జరుగుతున్న ఘోరం...
చరిత్ర పుటలు తడిసి పారుతున్న రక్తస్రావం...
జగానికి అంత జన్మనిచ్చు పెంచు తల్లి దేహం...
మృగాల చేతిలోన నెలకొరుగుతుంది నిత్యం...''
అంటూ సాగిన ఈ గీతాన్ని విజయ్ ఏసుదాస్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. రెహమాన్ రాశారు. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఆయన గట్టిగా ఎండగట్టారు. మృగాళ్లను నిలదీశారు. 


''ఎవరు నువ్వు తెలుసా మనిషి? నెలలు మోసి కడుపు కోసి కన్న నలుసువి, మనిషి విలువ మరిచి పశువై బలిసి మగువ మీద మదము చూపే జన్మ దేనికి?'' అంటూ సమాజానికి, ముఖ్యంగా మగాళ్లకు రెహమాన్ ప్రశ్నలు సంధించారు. మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నించిన గొప్ప పాటల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుంది. 


Also Read : బాలకృష్ణ వస్తేనే తాళి కడతా - మూడేళ్ళుగా వాయిదా పడుతున్న పెళ్ళికి బాలయ్య వస్తారా?



మార్చి 22న తెలుగు, హిందీలో 'గీత సాక్షిగా'
హోలీ సందర్భంగా 'గీత సాక్షిగా' విడుదల తేదీ వెల్లడించారు. మార్చి 22న సినిమా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో 'గీత సాక్షిగా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 'గీత సాక్షిగా జ‌డ్జ్‌మెంట్ డే మార్చి 22న' అని ఓ పోస్టర్ విడుదల చేశారు. చరిష్మా పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని చిత్ర బృందం తెలిపింది.   


'గీత సాక్షిగా' సినిమాలో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. 


Also Read : హాలీవుడ్ హీరోలకు ధీటుగా తారక్, చరణ్ - ఆస్కార్ ప్రమోషన్స్‌లో స్టైల్‌గా మన స్టార్స్


భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.