పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకు వెళ్లి నిలబడు, అక్కడ నీకు ఓ స్లోగన్ వినిపిస్తుంది - 'వీర సింహా రెడ్డి'లో డైలాగ్ ఇది. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు 'జై బాలయ్య' అనేది ఓ ఎమోషన్. ఏ హీరో అభిమాని అయినా సరే ఆ స్లోగన్ చెబుతున్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటే ప్రేక్షకుల్లో అంత క్రేజ్ ఉంది మరి! ఆయన పేరు చెబితే మాస్ (మాస్ అంటే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు) విజిల్స్ పడాల్సిందే. థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఈ తరం యువ హీరోలకు మించిన క్రేజ్ బాలయ్య సొంతం. ఆయన 60ల్లోకి వచ్చినా సరే క్రేజ్ అణువంత కూడా తగ్గటం లేదు. ఎగ్జాంపుల్ కావాలా? అయితే, పెద్ది నాయడు (Peddi Naidu) గురించి మీరు తెలుసుకోవాలి.
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతల అగ్రహారం గ్రామానికి చెందిన పెద్ది నాయుడికి చిన్నతనం నుంచి నందమూరి బాలకృష్ణ అంటే వీరాభిమానం. పెద్ది నాయుడు ఒక్కరికే కాదు... ఆయన కుటుంబంలోని అందరూ అంతే! నందమూరి వంశానికి, బాలకృష్ణకు వీరాభిమానులు. మరి అటువంటి వాతావరణంలో పెరిగిన పెద్ది నాయుడు మూడేళ్లుగా బాలకృష్ణ కోసమే తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.
బాలకృష్ణ వస్తే తాళి కడతానని...
గౌతమీ ప్రియ అనే అమ్మాయితో పెద్ది నాయుడు పెళ్లి కుదిరింది. అదీ ఇప్పుడు కాదు... మూడేళ్ల క్రితం! అయితే... తన పెళ్లికి బాలకృష్ణ రావాలని, తన అభిమాన హీరో అక్షింతలు వేయాలని, తమ జంటను ఆశీర్వదించాలని పెద్ది నాయుడు కోరుకుంటున్నాడు. బాలయ్య బాబు వస్తేనే తాను పెళ్లి చేసుకుంటాననని మంకు పట్టు పట్టి... భీష్మించుకు కూర్చున్నాడు. కరోనా రావడం... బాలయ్య డేట్స్ వీలు లేకపోవడంతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. పెద్ది నాయుడు పట్టుదల తెలిసిన కుటుంబీకులు, బంధువులు ఈ విషయాన్ని విశాఖలో ఉండే బాలయ్య బాబు చిన్న అల్లుడు భరత్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన ద్వారా విషయం బాలకృష్ణ దగ్గరకు చేరింది.
ఇప్పుడు బాలకృష్ణ పెట్టిన ముహూర్తానికి!
వీరాభిమాని పెద్ది నాయుడు గురించి తెలుసుకున్న బాలకృష్ణ... స్వయంగా ఆ యువకుడి పెళ్ళికి ముహూర్తం పెట్టారు. మార్చి 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, మార్చి 12న తెల్లవారుజామున... అంటే రేపు ఉదయం 02.20 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. బాలకృష్ణ పెళ్ళికి వస్తారని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరిలో బాలకృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలకృష్ణ ఫోటోలు ముద్రించిన టీ షర్టులు, గొడుగులు రెడీ చేశారు. ధూమ్ ధామ్ చేయడానికి రెడీ అయ్యారు.
బాలకృష్ణ వస్తారా? రారా?
నందమూరి తారక రత్న మరణం తర్వాత కొన్ని రోజులు తన కార్యక్రమాలు అన్నిటినీ బాలకృష్ణ క్యాన్సిల్ చేశారు. ఈ వారమే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, శ్రీ లీల మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షూటింగుకు ఒక్క రోజు బ్రేక్ వేసి పెళ్ళికి హాజరు అవుతారా? లేదా? అనేది సస్పెన్స్.
Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
ఇప్పుడు బాలకృష్ణ షెడ్యూల్ బిజీ. ఒక వైపు షూటింగులు, మరో వైపు కుటుంబ కార్యక్రమాలు, ఇంకో వైపు రాజకీయ పరమైన చర్చలు! అందులోనూ తారక రత్న మరణించి కొన్ని రోజులే అయ్యింది. ఈ సమయంలో ఆయన పెళ్ళికి వెళతారా? లేదా? అనేది చూడాలి. ఏది ఏమైనా తన పెళ్ళికి బాలకృష్ణ వస్తారని పెద్ది నాయుడు ధీమాగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తప్పకుండా బాలకృష్ణ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం