Hyderabad Rains : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. వర్షపు నీరు రోడ్లపై చేరుతోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, హైటెక్‌సిటీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, చైతన్యపురి, అంబర్‌పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాహనదారుల ఇక్కట్లు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లా జీడీమెట్ల , కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం,షాపూర్ నగర్,గాజులరామరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీడిమెట్లలో వర్షం లోనే గణపతి నిమజ్జనానికి భక్తులు తరలవెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఖైరతాబాద్ గణేషుడిపై వర్ష ప్రభావం పడింది. మట్టి విగ్రహం కావడంతో ప్లాస్టిక్ కవర్లు కప్పారు నిర్వహకులు. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, జీడిమెట్ల, సురారంతో పాటు నగరంలో చాలా ప్రాంతాల్లో గంటకు పైగా ఆగకుండా వర్షం కురిసింది.
ఏపీలో వర్షాలు
తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.
Also Read : తెగిపోయిన జమ్మలమడుగు, ముద్దనూరు డైవర్షన్ రోడ్డు!
Also Read : వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు! ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ: IMD