తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఉత్తర, దక్షిణ ద్రోణి పయనిస్తూ ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. బుధవారం (సెప్టెంబరు 7) తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఈ నెల 9 వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఇప్పటికే రెండు రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.


దక్షిణ కోస్తాంధ్రలో కాస్త తక్కువ
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నారు. కానీ, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
ఈ భారీ వర్షాల ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో ఉంటుందని తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడేందుకు కూడా అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోంగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.


తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో పసుపు రంగు, నారింజ రంగు అలెర్ట్స్ జారీ చేసింది. 


ఈ జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేసిన వివరాలు, అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వర్షాల ప్రభావం ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 


సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, ఖమ్మం నల్గొండ, మెదక్‌ మహబూబాబాద్‌, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్‌, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. రేపు (సెప్టెంబరు 9) కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, మల్కాజ్‌గిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వరంగల్‌, రంగారెడ్డి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌, నిజామాబాద్‌ లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.