Kumaraswamy Meets CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ముందుగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కుమారస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ తో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటితో పాటు జాతీయ రాజకీయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు కుమారస్వామి తెలిపారు. ఆ భేటీ అనంతం కుమారస్వామి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ తో కుమారస్వామి భేటీ
జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉండబోతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో కుమారస్వామితో భేటీ కీలకంగా మారింది. కేసీఆర్ పెట్టబోయే జాతీయపార్టీపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. కుమారస్వామి ప్రగతిభవన్ కు చేరుకోవడానికి ముందు ఓ హోటల్ లో కుమారస్వామితో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రాజేందర్ రెడ్డి సమావేశం అయ్యారు. దేశంలో తాజా రాజకీయాలతో ఈ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానాలు కూడా చేస్తున్నాయి. కేంద్రంతో పోరాడాలంటే జాతీయ పార్టీ తప్పనిసరి భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2024లో కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ముందు అనేక ప్రతికూలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఉత్తరాది ప్రజలకు తెలియకపోవడం దగ్గర్నుంచి తెలంగాణ పేరుతో ప్రాంతీయ ఉద్యమం నడిపి ఇప్పుడు దేశం మొత్తం రాజకీయం చేస్తాననే భావజాలం వరకూ అనేక ప్రతికూలతలు ఉన్నాయి. అయినా కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకం అని అనుకోవచ్చు.
రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులకు అందని నేత కేసీఆర్ !
తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అందని రాజకీయం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు. కానీ ఓ ప్రాంతీయ పార్టీ నేత . అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికే టీఆర్ఎస్ పేరుతో కాకుండా జాతీయ పార్టీని ఆయన పెడుతున్నారు. అంటే తెలంగాణ ఇమేజ్‌ను వదిలి నేషనల్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Also Read : KCR National Party : అన్నీ ప్రతికూలతలే - ఢిల్లీకి గురి పెట్టిన కేసీఆర్ నమ్మకమేంటి ?