Hyderabad SHO: హైదారాబాద్ చరిత్రలోనే తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మధులత బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లాలాగూడ పోలీస్ స్టేషన్ లో హోంమంత్రి మహమూద్ అలీ, సీపీ సీవీ ఆనంద్ స్వయంగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. బాధితులకు న్యాయం చేసేందకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని ఏబీపీ దేశంతో మధులత అన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే తొలి మహిళా ఎస్ హెచ్ ఓ మధులత రికార్డుల్లో స్థానం సంపాదించనున్నారు. లాలాగూడ ఎస్ హెచ్ ఓగా ఆమె ఇవాళ బాధ్యతలు చేపట్టారు. 174 ఏళ్ల తరువాత మొదటి సారి ఓ మహిళా సీఐకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 







ఏబీపీ దేశంతో ఎస్.హెచ్.ఓ మధులత 


ఎస్.హెచ్.ఓ మధులత ఏబీపీ దేశంతో మాట్లాడుతూ ... 'ఈ బాధ్యత నా అదృష్టంగా భావిస్తున్నాను. 2002లో ఎస్సై నా కెరియర్ మొదలు పెట్టాను. పాత మెదక్ జిల్లా,  సిద్దపేట, ములుగులో పనిచేశాను. ఇరవై నాలుగు గంటలూ బాధితులకు అందుబాటులో ఉంటాను. సీపీ ఆనంద్, హోంమంత్రికి నా ధన్యవాదాలు. ఈ మహిళా దినోత్సవం నా జీవితంలో మరువలేనిది. కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ఇదివరకు ఉన్న పరిస్దితులు ఇప్పుడు లేవు. ప్రతీ రంగంలో మహిళ ముందే ఉంది. మహిళల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని అబ్బాయిలకు చెప్పాలి.  


మహిళలకు 33 శాతం రిజర్వేషన్ 


మహిళా దినోత్సం రోజున హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్‌స్పెక్టర్‌ను శాంతిభద్రతల విభాగం పోలీసు స్టేషన్‌కు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(Station House Office)గా నియమించారు. మంగళవారం హోంమంత్రి మహమూద్‌ అలీ, సీపీ ఆనంద్‌ సమక్షంలో లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా మధులత బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. దీంతో పోలీసు శాఖలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 3,803 మంది మహిళా పోలీసు సిబ్బంది, అధికారిణిలు ఉన్నారు. వీరితో పాటు హోంగార్డులు అదనంగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో 31 మంది మహిళలు ఉన్నారు. అటవీ, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూ శాఖల్లో మాత్రం మహిళలను సమానమైన హోదాల్లో నియమిస్తున్నారు. కానీ పోలీసు విభాగంలో మాత్రం ఎస్‌హెచ్‌ఓ నియామకం గతంలో జరగలేదు. మహిళ పోలీస్ స్టేషన్లు, ఉమెన్‌ సేఫ్టీ స్టేషన్లు, భరోసా కేంద్రాలు, లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లకు మాత్రమే మహిళా అధికారులను నియమించేవారు. దీంతో సీపీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి ఎస్‌హెచ్‌ఓగా అవకాశం ఇస్తే ఆ స్ఫూర్తితో డిపార్ట్‌మెంట్‌లో మహిళా పోలీసులు మరింత సమర్థవంతంగా పని చేస్తారని ఈ  నిర్ణయం తీసుకున్నారు.