OU Rahul Gandhi Meet : హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సభకు పాలకవర్గం అనుమతి నిరాకరించింది. రాహుల్‌ గాంధీ సభకు అనుమతి ఇవ్వకూడదని ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌  కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ గాంధీ సభతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని కౌన్సిల్‌ నిర్ణయించింది. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. 


రాహుల్ సభకు నో పర్మిషన్ 


రాహుల్ సభకు మాత్రమే కాకుండా వర్సిటీలో ఎలాంటి బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు క్యాంపస్‌లో కెమెరాలను కూడా నిషేధించింది. రాహుల్ గాంధీ మే 6న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజరవుతారు. మే 7న హైద‌రాబాద్‌లో రాహుల్ గాంధీ పార్టీ కార్యక‌ర్తలు, నేత‌ల‌తో స‌మావేశం అవుతారు. అయితే మే7న ఓయూలో రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ యూనివ‌ర్సిటీ అధికారుల‌ను కోరింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓయూ వీసీని కలిసి రాహుల్ సభకు అనుమతి కోరారు. అయితే ఈ సభకు ఓయూ పాలకవర్గం రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాకరించింది. 


ఓరుగల్లులో రాహుల్ సభ 


రాహుల్ గాంధీ వరంగల్ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. వరంగల్‌లో ర్యాలీ కూడా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మే 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. అక్కడి నుంచి కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ వరకు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు రాహుల్ బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాహుల్ గాంధీ సభకు రైతు సంఘర్షణ సభగా పేరు పెట్టారు. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పూర్వస్థాయిని అందుకునే ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 


రాజకీయ చర్చ కాదన్నా!


కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తుంది. అయితే ఓయూలో రాహుల్ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహిస్తారని, ఈ సభకు రాజకీయాలతో సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ జెండాలు, కండువాలు వేసుకురామని తెలిపింది. విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే ఓయూ పాలకవర్గం వర్సిటీలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. 


ఓయూలో ఉద్రిక్తత 


రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంపై ఓయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వం రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నిరసన చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.