హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12 కోట్లతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. 200 ఐసీయూ బెడ్స్, కొత్తగా 120 వెంటిలేటర్లను ఏర్పాటుచేశారు. నిమ్స్ ఆసుపత్రిలో త్వరలో రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి రానుంది. మాతా శిశువుల కోసం నిమ్స్ అటాచ్డ్ గా 200 పడకల ఆస్పత్రి మంజూరైంది. నిమ్స్ ఆసుపత్రిలో ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం.ఆర్.యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం, వాటర్ ఏటిఎంలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం అన్ని విభాగాల హెచ్వోడీలతో సమీక్ష నిర్వహించారు.
రూ. 12 కోట్లతో మెడికల్ ఎక్విప్మెంట్
మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ...'రూ.12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా మెడికల్ జెనిటిక్ ల్యాబొరెటరీ అందుబాటులోకి వచ్చింది. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక లాబ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్ యూనిట్ నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చాం. బోన్ డెన్సిటీవ్ మీటర్ ద్వారా బోన్స్ సామర్థ్యం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేశాం' అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మరో 120 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులోకి
గతంలో నిమ్స్ ఆసుపత్రిలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నిమ్స్ ను బలోపేతం చేయాలని, మరో 200 పడకల ఐసీయూ బెడ్స్ మంజూరు చేశారన్నారు. ఈ 200 బెడ్స్ జనవరి 15 లోగా అందుబాటులోకి తేవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇవి పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్ లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో వెంటిలేటర్ బెడ్ దొరకాలంటే కష్టంగా ఉండేదన్నారు. పేదవాళ్లు వెంటిలేటర్ పై ఉండాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదన్నారు. ఇప్పుడు నిమ్స్ లో 89 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. మరో 120 వెంటిలేటర్లు కొత్తవి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మొత్తం 209 వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే 45 రోజుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
త్వరలో రోబోటిక్ సర్జరీ
రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ డిపార్టమెంట్లలో ఆధునిక ఎక్విప్మెంట్ కావాలని వైద్యులు కోరారని మంత్రి హరీశ్ అన్నారు. వీటిల్లో రోబోటిక్ సర్జరీ ముఖ్యమైనదన్నారు. చేతి వేళ్లు వెళ్లలేని చోట రోబోటిక్ సర్జరీ చేస్తారన్నారు. దీనికోసం రూ.12 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఆసుపత్రిలో రూ.154 కోట్ల కొత్త ఎక్విప్మెంట్ కోసం నిధులు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు 5 గురు చికిత్స పొందుతున్నారన్నారు. నిమ్స్ లో 8 బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పడకలున్నాయన్నారు.
Also Read: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
హై రిస్క్ ప్రెగ్నెంట్ పేషెంట్ల కోసం ఆసుపత్రి
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నిమ్స్ తో పాటు మరో 4 ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. ఆల్వాల్, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్, టిమ్స్, చెస్ట్ ఆస్పత్రిలో నాలుగు వైపులా వెయ్యి పడకల ఆస్పత్రులు, తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తెవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. నిమ్స్ లో పడకలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ పేషెంట్ల కోసం గైనకాలజీ డిపార్ట్ మెంట్ పెట్టాలని వైద్యులు కోరారన్నారు. 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని నిమ్స్ కు అటాచ్డ్ గా తేవాలని నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయ్యే వారికి, వారి జీహెచ్ఎంసీతో మాట్లాడి రూ.5 భోజనం పెట్టాలని నిర్ణయించామన్నారు.
ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు
ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కాలేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నారన్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వాక్సిన్ ప్రచారం నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి రోజు లక్ష వరకూ నిర్థారణ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు.
Also Read: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి