YS Sharmila: పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ కు పది ప్రశ్నలు సంధించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు తాన అడిగిన ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకంటే ముందే హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.


9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 9 సంవత్సరాల్లో 4.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని.. ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టారని చెప్పారు. తెచ్చిన అప్పులు అన్నీ ఎక్కడికి పోయాయని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీ చేశారని.. తెలంగాణ సొమ్మంతా కేసీఅర్ అప్పనంగా లాగేసుకున్నాడని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసేందుకు అంత ఖాళీ చేని.. ఉద్యమంలో నేను నా ముసల్ది తప్పా ఇంకెవరూ లేరంటూ కోతలు కోశారని వివరించారు. 


తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమయ్యిందని అడిగారు, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో మరో పెద్ద మోసానికి తెర లేపారని.. తెలంగాణలో 36 లక్షల మందికి సొంత ఇళ్లులు లేవని వైఎస్. షర్మిల చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేవలం 26 వేల ఇండ్లు ఇస్తే.. 36 లక్షల మందికి న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దళిత బందు వల్ల ఎమ్మెల్యే తప్ప మరెవరూ లాభ పడలేదని.. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్ధరించింని దశాబ్ది ఉత్సవాలు చేస్తందో చెప్పాలని కోరారు. 


వైఎస్ షర్మిల అడిగిన పది ప్రశ్నలు ఇవే..!



  1. 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు .?

  2. 10 ఏళ్ల క్రితం మీ ఆస్తులు ఎన్ని..? ఎప్పుడు ఎన్ని..?

  3. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమయ్యింది .?

  4. 2014 నుంచి 2023 వరకు ఎన్ని భూములు అమ్మారు? 30 వేల ఎకరాలు అమ్మిన మాట నిజం కాదా..?

  5. కోటి ఎకరాల మాగాణి ఇస్తామని చెప్పి ఎన్ని ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు..?

  6. కేజీ టూ పీజీ ఉచిత విద్యుత్ హామీ ఎక్కడ పోయింది

  7. రైతులు కోటేశ్వరులు అయితే 9 వేల మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు

  8. తెలంగాణ లో అమర వీరుల పరిస్థితి ఎంటి..?

  9. తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా..?

  10. ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ పార్టీలో విలీనం చేయాలా..?


వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది..!


YSR పేరుతో పార్టీ పెట్టీ రెండేళ్లు అవుతుందని.. తెలంగాణలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగాయని విమర్శించారు. కేసీఆర్ 9 సంవత్సరాలుగా ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఅర్ కి సప్లయ్ కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు నిద్రపోతేనే తాను తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల తెలిపారు. జాతీయ పార్టీలు నిద్రపోతే వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల మీద కొట్లాడిందని అన్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించింది కేవలం తాను మాత్రమేనని చెప్పుకొచ్చారు. 3850 కిలో మీటర్ల పాదయాత్ర చేసింది.. పొత్తులకు, విలీనం చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఇంత కష్ట పడింది పార్టీని విలీనం చేయడానికి కాదని.. తాను ఏదైనా పార్టీలో చేరుతానంటే తనను వద్దనేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. తాను బీఆర్ఎస్ లో చేరుతానంటే కీసీఆర్ కూడా వద్దనరని వ్యాఖ్యానించారు. తన పార్టీ విలీనం అంటూ.. తాను పడిన కష్టాన్ని తక్కువ చేయడం సరికాదన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దింపుతామని.. ప్రస్తుతం తాము అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. 


2018లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుస్తే.. 14 మంది ఎమ్మెల్యేలను సీఎం కేసీఅర్ కొనుగోలు చేశారని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. కేసీఆర్‌కి ఓటు వేసినట్లేనని అన్నారు. అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఎలక్షన్ తర్వాత కేసీఆర్‌కి మద్దతు ఇస్తుందా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కి కాంగ్రెస్ మళ్ళీ సప్లైంగ్ కంపెనీగా మారదు అనే గ్యారెంటీ ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తీరాలన్నారు. అలాగే అన్ని పార్టీలు కేసీఅర్ కి వ్యతిరేకం అని క్లారిటీ ఇవ్వాలని.. అప్పుడే పొత్తులకు సంబంధించి ఆలోచన చేస్తామన్నారు. అమర వీరుల సాక్షిగా కేసీఆర్‌తో పొత్తు ఎప్పటికీ ఉండదని వైఎస్ షర్మిల చెప్పారు.