Manipur Violence: 


రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో కమిటీ..


మే 3వ తేదీ నుంచి మణిపూర్‌ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులు సమీక్షించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గవర్నర్ నేతృత్వంలోనూ మరో కమిటీ ఏర్పాటు కానుంది. ఇదే విషయాన్ని అమిత్‌షా అధికారికంగా వెల్లడించారు. 


"గత నెల మణిపూర్‌లో అల్లర్లు జరిగాయి. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మణిపూర్‌లో మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించాను. అధికారులతో భేటీ అయ్యాను. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏం చేయాలో పరిశీలించాను. మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన నేతలనూ కలిశాను. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ అవసరం. అందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. గవర్నర్‌ నేతృత్వంలో మరో కమిటీ కూడా ఏర్పాటవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఎవరు ఈ కుట్ర చేశారన్నది వాళ్లు త్వరలోనే ఛేదిస్తారు. పారదర్శకంగా విచారణ జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ప్రజలంతా ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరి వద్దనైనా ఆయుధాలుంటే వెంటనే వాటిని పోలీసులకు అప్పగించండి"


- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి