NTR Memorial Coins: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 స్మారక నాణెం (NTR Commemorative Coin) అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ (Hyderabad) మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు కాగా, మార్కెట్లోకి విడుదలైన 2 నెలల్లోనే 25 వేల నాణేలు అమ్ముడయ్యాయి. దేశంలోనే ఇది సరికొత్త రికార్డని మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. 


200 నాణేల్లో ప్రథమ స్థానం


'దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకూ ముద్రించిన వాటిలో రికార్డు స్థాయిలో 12 వేల అమ్మకాలు జరిగాయి. తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం ఆ రికార్డును అధిగమించింది.' అని మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విజయం తథ్యమని ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం అత్యధిక విక్రయాలతో ప్రథమంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.


ఆగస్ట్ 28న విడుదల


దివంగత ముఖ్యమంత్రి, తెలుగు నట దిగ్గజం నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రూ.100 నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 28న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. 


Also Read: Atchennaidu Comments: 'ఊరూ వాడా నాసిరకం మద్యం' - వైసీపీ నేతలు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు