Virupaksha Shows : హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. అయితే హైదరాబాద్ మూసాపేటలోని ఏషియన్ లక్ష్మీ కళ థియేటర్ లో విరూపాక్ష సినిమా షో చెప్పిన సమయానికి ప్రదర్శించకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురైయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షో కు సంబంధించిన టికెట్లు విక్రయించారు. అయితే సాయంత్రం 7.30 గంటల వరకూ షో వేయకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. థియేటర్ యాజమాన్యం సనత్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి ప్రేక్షకులను అదుపుచేశారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు చెల్లించింది థియేటర్ యాజమాన్యం. 


విరూపాక్షకు సూపర్ క్రేజ్ 


సాయి ధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరూపాక్ష’.. ఎక్కడాలేని క్రేజ్ లభిస్తోంది. పబ్లిసిటీతో పనిలేకుండానే.. మౌత్ పబ్లిసిటీతో మూవీకి బోలెడంత బజ్ లభిస్తోంది. దీంతో ‘విరూపాక్ష’ చిత్రయూనిట్ గుండెలపై చేతులు వేసుకుని హాయిగా రిలాక్స్ అవుతోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్‌లకు అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పాజిటివ్ టాక్ వల్ల సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకు రూ.10.58 కోట్లు లభించాయి. అయితే, ఇది శుక్ర, శనివారాల్లో లభించిన మొత్తం. ఆదివారం వసూళ్లు ఇంకా ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది.  


రెండు రోజుల్లోనే రూ.10.58 కోట్లు వసూలు 


రెండో రోజైన శనివారం ‘విరూపాక్ష’కు నైజాంలో రూ.2.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.75 లక్షలు, సీడెడ్‌లో రూ.89 లక్షలు వచ్చాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో కలిసి రూ.5.79 కోట్లు వసుళ్లు లభించాయి. మూవీ విడుదలైన రోజు నుంచి రెండు రోజుల వసూళ్లను కలిపితే.. రూ.10.58 కోట్లు వచ్చాయి. వీటిలో అత్యధిక నిజాం (రూ.4.53 కోట్లు) నుంచే వచ్చాయి. విశాఖలో రూ.1.33 కోట్లు, సీడెడ్‌లో రూ.1.43 కోట్లు, గుంటూరులో రూ.81 లక్షలు, నెల్లూరులో రూ.38 లక్షలు, కృష్ణలో రూ.70 లక్షలు, పశ్చిమలో రూ.66 లక్షలు, తూర్పులో రూ.74 లక్షలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా లభించిన 13.5 కోట్ల వరకు కలెక్షన్లు లభించినట్లు తెలిసింది. అంటే మొత్తంగా రెండు రోజుల్లోనే ఈ మూవీ సుమారు రూ.20 కోట్లను దాటేసింది. ఈ మూవీని త్వరలో హిందీతోపాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతమైతే చిత్రయూనిట్ తెలుగు, తమిళ వెర్షన్ల కలెక్షన్ల మీదే ఫోకస్ పెట్టారు. అయితే, తమిళనాడులో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేనట్లు తెలుస్తోంది. అక్కడ ఇప్పటి వరకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే వసూళ్లయ్యాయి. అయితే, తమిళ డబ్బింగ్ వెర్షనా లేదా తెలుగు వెర్షనా అనేది తెలియాల్సి ఉంది.