Guntur News: నిన్నటి వరకు వేడి గాలులు, ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డ ప్రజలను చల్లని గాలులు తెగ సంతోష పెడుతున్నాయి. అలాగే వర్షం కూడా పలకరించడంతో ప్రజలంతా చాలా సంతోష పడ్డారు. కానీ ఇదే వర్షం ఓ గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. ఓ ఇద్దరు రైతులను బలి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 


అసలేం జరిగిందంటే..?


ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులతో వర్షం ప్రారంభమైంది. పత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం పొలాల్లో వర్షం నుంచి మిర్చి పంటను కాపాడుకునేందుకు  ప్రయత్నించి ఇద్దరు రైతులు మృత్యు వాత పడ్డారు. మల్లాయపాలెంకు చెందిన రైతులు శ్యాబాబు(50), కృపానందం(55) పొలాలు పక్క పక్కనే ఉన్నాయి. అయితే నిన్ననే వీరిద్దరూ మిర్చి పంటను కోసి కల్లాలపై ఆరబెట్టారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం పడటం ప్రారంభం అయిన వెంటనే పొలానికి చేరుకున్నారు.


కల్లాలపై ఉన్న మిర్చిని కాపాడుకునేందుకు పట్ట కప్పడం ప్రారంభించారు. ఒక్క సారిగా ఈదురు గాలి‌ ఉరుములు, మెరుపులోతో వాన ఉద్ధృతమైది. గాలి వానకు తోడుగా పెద్ద ఎత్తన ఉరుములతో పిడుగుల పడ్డాయి. అయితే పిడుగు ధాటికి రైతులిద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శ్యాంబాబు, కృపానందం కల్లాల వద్దే మరణించారు. అయితే చాలా సేపటి తర్వాత పొలంలో పడిపోయి ఉన్న ఇద్దరిని గమనించిన స్థానికులు హుటాహుటిన పత్తిపాడు పీహెచ్ కు తీసుకువచ్చారు. ఆప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృత‌దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.


పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. (Thunderstorm Lightning Dos)



  • ఉరుములు, మెరుపులో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.

  • సముద్రము, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే వాటికి దూరంగా వెళ్లాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.

  • ఉరుమలు శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలికారు, బస్సు లాంటి వాహనాల లోపల ఉన్నట్లయితే వెంటనే అన్ని డోర్స్ మూసి ఉంచాలి.

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జట్టు నిక్కబొడుచుకోవడం గానీ, చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించండి.

  • బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని.. తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి. దీని వలన ఉరుములు, మెరుపులు నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

  • ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే కిటీకీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్ధం ఆగిపోయిన తరువాత కూడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి.

  • పిడుగు బాధితులను తాకవచ్చు. వెంటనే వారికి సహాయం అందించండి

  • పిడుగు బాధితుడిని వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, ఏదైనా ఆసుప్రతికి తరలించండి