Organ Donation : శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శవంతమైన సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాస్తూ విద్యార్థి కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. విద్యార్థి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో జేమ్స్ ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె, లివర్, కిడ్నీలు తరలించారు. తిరుపతికి గుండె, విశాఖకు కిడ్నీ, లివర్ అవయవాలు తరలించారు వైద్యులు. తమ కుమారుడు మరొకరి రూపంలో బతికే ఉంటాడని కిరణ్ చంద్ ను గుర్తుచేసుకున్నారు కుటుంబ సభ్యులు. అవయవదానంపై అవగాహన కల్పించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ చంద్ కుటుంబ సభ్యుల నిర్ణయంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
గుండె తరలింపునకు టీటీడీ ఏర్పాట్లు
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో గుండె తరలించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్‌లో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ చంద్ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అంతటి విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బతికే ఉండాలని ఆకాంక్షించి అవయవదానానికి ముందుకొచ్చారు. కిరణ్ చంద్ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రి నుంచి విశాఖ ... అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం.. తిరుపతి చిన్నపిల్లల హాస్పిటల్ వరకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తరలించారు. టీటీడీ చిన్నపిల్లల హాస్పిటల్ లో ఇవాళ మూడో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేశారు. సూరత్ లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను వైజాగ్ మీదుగా తిరుపతికి తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోడ్డు మార్గంలో శ్రీకాకుళం నుంచి వైజాగ్ కి గుండె తరలించాలి. వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ లో తిరుపతికి తరలించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఇద్దరు చిన్నారులకు గుండె మార్పిడి చికిత్సలను టీటీడీ చిన్న పిల్లల హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు
30 ఏళ్ల కార్మికుడి బ్రెయిన్ డెడ్
హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల కార్మికుడికి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా అవయవదానం చేశారు. ముషీరాబాద్‌లోని జవహర్ నగర్‌లో 30 ఏళ్ల పోటకారి రాజేశ్ నివసిస్తుండేవారు. ఏప్రిల్ 12న ఆరోగ్యం క్షీణించి ఇంటిలోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు రాజేశ్‌ను ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్‌కు తరలించారు. అక్కడ రాజేశ్‌కు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందించారు. అయితే రాజేశ్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఏప్రిల్ 15న రాజేశ్ బ్రెయిన్ డెడ్ అయినట్టు న్యూరోఫిజీషియన్లు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది, జీవన్‌దాన్ కోఆర్డినేటర్లు కలిసి రాజేశ్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి... అవయవదానం చేయడానికి ఒప్పించారు. రాజేశ్ అవయవాలను దానం చేయడానికి ఆయన భార్య పోటకారి శాలిని, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. రాజేశ్ రెండు కిడ్నీలు, కార్నియాలను సేకరించిన వైద్యులు... అవసరార్థులకు కేటాయించామని తెలిపారు.