Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ అదానీ కోసం... వన్ నేషన్ వన్ ఫ్రెండ్ పథకాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఎ మిత్ర్ కాల్ లో "వన్ నేషన్.. వన్ ఫ్రెండ్" అనేది కొత్త పథకమని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి "ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం" అని చెప్పారన్నారు. దీనిపై వార్తలు వచ్చాయన్నారు. ఓ పత్రికా క్లిప్పింగ్స్ ను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదానీకి ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ ప్రధాని మోదీ తన అధికారాన్ని ఉపయోగించారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ గుర్తుచేశారు. మోదీ సర్కార్ అమృత కాలాన్ని ఎ మిత్ర్ కాల్‌గా కేటీఆర్ వ్యంగ్యంగాఅభివర్ణించారు. వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనేది మోదీ తీసుకొచ్చిన కొత్త పథకమని వ్యాఖ్యానించారు.
హరీశ్ రావు-గవర్నర్ మధ్య ట్వీట్ల వార్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం ట్విటర్ వేదికగా సాగింది. మెడికల్ కాలేజీల విషయంలో ఒకరిపై మరొకరు పరస్ఫరంగా విమర్శలు చేసుకున్నారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ సమాధానం ఇవ్వగా, దానికి మంత్రి హరీశ్ రావు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కేరళలోని కోజికోడ్‌లో నిర్మించిన వైద్య కళాశాలను ప్రశంసిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం (మార్చి 6) ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు. అప్పుడు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆలస్యంగా మేల్కొన్నదని అన్నారు. పీఎంఎస్‌ఎస్‌వై కింద కొత్త మెడికల్ కాలేజీల కోసం అన్ని రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్నాయని, తెలంగాణ ప్రభుత్వం సకాలంలో దరఖాస్తు చేసుకోలేదని విరించారు. పార్లమెంటులో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా చేసిన వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమిళనాడు కేవలం ఒకే ఏడాదిలో 11 వైద్య కళాశాలలను పొందిందని గుర్తు చేశారు.
హరీశ్ రావు కౌంటర్
దీనిపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దీటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కొత్తగా మంజూరు చేసిన 157 కాలేజీల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీల విషయంలోనూ ఇదేలాగా ఉందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు ఒక్కో విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నా, రూ.156 కోట్లు ఇచ్చారని, అంటే 11.4 శాతం మాత్రమే ఇచ్చారని అన్నారు. 2018లోనే మంజూరైన గుజరాత్ ఎయిమ్స్‌కి 52 శాతం నిధులు ఇవ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి గవర్నర్ ప్రయత్నిస్తే ప్రజలకు గొప్ప మేలు చేసినవారవుతారని మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రులు మాట్లాడిన కొన్ని వీడియోలు కూడా జత చేశారు.