Minister KTR : టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందని, నిధులు ఇవ్వకుండా ఆగం చేస్తుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం అన్నీ చేస్తుందని అయినా రాజకీయాల కోసం టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు సమయం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. అవార్డులు, నిధులు, కాలేజీలు అంశం ఏదైనా సరే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు కొనసాగుతోంది. తాజాగా మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయకముందే బీజేపీ జాతీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అక్టోబర్ 15 లోపు ఉపఎన్నిక ఉంటోందని ప్రకటించేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేశారు. 






బీజేపీ పేరు ఇలా మార్చేయండి


బీజేపీ తీరుపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. "ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే బీజేపీ నేతలు ఎన్నికల తేదీలు చెప్పేస్తారు, ఈడీ కన్నా ముందే ఎక్కడ సోదాలు జరుగుతాయో బీజేపీ చెప్పేస్తుంది, ఎన్ఐఏ నిషేధం ప్రకటించకముందే బీజేపీ ఆయా సంస్థలను నిషేధిస్తుంది, ఐటీ, సీబీఐ దాడులకు ముందే బీజేపీ నిందితుల పేర్లు చెప్పేస్తుంది "అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన డైరెక్షన్ పెట్టుకుని ఆడిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయో ముందుగానే బీజేపీ నేతలు చెప్పేస్తారని, బీజేపీ సర్కార్ డైరెక్షన్ లో కేంద్రం సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే బీజేపీని "BJ...EC-CBI-NIA-IT-ED...P" ఇలా మార్చుకోవాలని సూచించారు. 


కిషన్ రెడ్డికి కౌంటర్ 


మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర సర్కారు నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదాని పట్టిస్తోందని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్తగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 9 మెడికల్ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే మెడికల్ కాలేజీల విషయంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. శనివారం ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిపై, కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు బీజేపీ నాయకులు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంత్రిని నేనెప్పుడు చూడలేదని కేటీఆర్ అన్నారు. సోదరుడిగా మిమ్మల్ని గౌవిస్తాను కానీ.. మీరు చెప్పింది పూర్తిగా తప్పు అని ఘాటుగా జవాబు ఇచ్చారు.  ' గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారూ.. ఓ సోదరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తా, కానీ మీలా అసత్యాలు ప్రచారం చేసే కేంద్ర మంత్రిని నేను చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలను కేటాయించిందంటూ మీరు ప్రకటించింది పచ్చి అబద్ధం. మీకు ఈ అంశంలో క్షమాపణలు అడిగే ధైర్యం లేదు' అని కేటీఆర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 


 Also Read : KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్


Also Read : KCR National Politics : దేశమంతా చర్చించుకునేలా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - అంచనాలకు అందని విధంగా పబ్లిసిటీ ప్లాన్ !