KCR National Politics :  రాజకీయ పార్టీ ఆషామాషీగా పెట్టాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకోవడం లేదు. జాతీయ పార్టీ వెనుక సుదీర్ఘమైన కసరత్తు ఉంది. నెలల తరబడి విధానపరంగా.. పబ్లిసిటీ పరంగా.. క్యాడర్ పరంగా తీసుకోవాల్సిన  జాగ్రత్తల  గురించి ఆలోచించారు. అన్ని రకాల ప్లాన్లతో రెడీ అయ్యారు. ముఖ్యంగా పబ్లిసిటీ ప్రణాళికను పక్కాగా రెడీ చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో చర్చలు జరిగేలా చూసుకుంటున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి. 


జాతీయ అంశంగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన !


సాధారణంగా దక్షిణాది రాజకీయాలు జాతీయ మీడియాగా చెప్పుకునే ఇంగ్లిష్ , హిందీ మీడియాల్లో ఎక్కువగా హైలెట్ కావు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ప్రాంతీయ భాషా చానళ్లు పాతుకుపోయాయి. జాతీయ పార్టీల హవా లేదు. ఈ కారణంగా ఇంగ్లిష్ , హిందీ న్యూస్ చానళ్లలో దక్షిణాది వార్తలు పెద్దగా వర్కవుట్ కావని అనుకుంటారు. అందుకే ప్రాధాన్యత ఇవ్వరు. ఇటీవలి కాలంలో పరిస్థితి మారుతోంది. కానీ ఓ దక్షిణాది నేత జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటే భారీగా కవరేజ్ ఇచ్చే పరిస్థితి ఉండదు.కానీ కేసీఆర్ తన పార్టీ అంశాన్ని నేషనల్ ఇష్యూగా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చాలా మీడియా చానళ్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. డిల్లీలో కాకలు తీరిన జర్నలిస్టును పీఆర్వోగా పెట్టుకున్నారు. ఆ ఫలితంగానే ఇటీవలికాలంలో కేసీఆర్ జాతీయ పార్టీపై .. తెలంగాణ అభివృద్ధిపై జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. 


కేసీఆర్ విధానాలపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చలు!


ఉచిత విద్యుత్ అంశాన్ని కేసీఆర్ ప్రకటించగానే దేశవ్యాప్త స్పందన వచ్చింది. చాలా చానళ్లు.. దీనిపై విశ్లేషించాయి. తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలవుతున్న తీరు.. దేశవ్యాప్తంగా అమలుచేయగలరా ? అని చర్చించాయి. పాజిటివో.. నెగెటివో ఏదో ఒకటి చర్చించారు. రాజకీయ నాయకులకు కావాల్సింది కూడా అదే. ఒక్కో సారి నెగెటివ్ ప్రచారం కూడా ఎంతో ప్లస్ అవుతుంది. కేసీఆర్ విధానాలపై చర్చ జరిగింది అంటే అక్కడి  ప్రజల్లో ఆసక్తి ప్రారంభమయిందనే అర్థం . ఆ కోణంలో ఇప్పటికే కేసీఆర్ ముందడుగు వేసినట్లే్. ముందు ముందు కేసీఆర్ చేసే ప్రకనటలన్నీ జాతీయ మీడియాలో హైలెట్ కానున్నాయి. 


ఇప్పటికే పలు మీడియా సంస్థలతో సన్నిహిత సంబంధాలు !


దేశం విషయంలో తన దృక్పధాన్ని స్పష్టంగా వెల్లడించే కేసీఆర్ ..  దేశ రాజకీయాల్లో మీడియా మద్దతు కోసం తన వంతు కృషి  చేశారు. టీఆర్ఎస్ కు బలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆయా మీడియా చానళ్లకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వనున్నారు. కేసీఆర్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం  చేసేందుకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వనున్నారు. వాటితో పాటు మీడియా చానళ్ల న్యూస్ వేరు. కేసీఆర్‌పై ఇప్పటికే ఓ పాజిటివ్ భావన ప్రజల్లోకి వెళ్లింది. దీన్ని మరింతగా తీసుకెళ్లేలా మీడియా సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇక ఇప్పటి  రాజకీయాల్ని శాసిస్తున్న సోషల్ మీడియా విషయంలోనూ కేసీఆర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీ, ఇంగ్లిష్ లలో సోషల్ మీడియా టీముల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. 


కేసీఆర్ జాతీయ పార్టీ ముందుగా ఉత్తరాది ప్రజల్లోకి వెళ్లాలి. అలా వెళ్లాలంటే మీడియా సహకారం ఎంతో అవసరం. ఈ విషయం .. కేసీఆర్‌కు తెలియనిదేం కాదు. అందుకే మీడియా మద్దతు పొందడానికి ఆయన చేయాల్సిదంతా చేశారు. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు జాతీయ అంశం అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.