Minister KTR : "స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అప్పటి కేంద్ర హోంమంత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈరోజు 74 ఏళ్ల తర్వాత మనల్ని విభజించడానికి, మమ్మల్ని లొంగదీసుకోవడానికి, కేంద్రం చెప్పే మాటలకు కట్టుబడి ఉండమని బలవంతం చేయడానికి ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. " అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.


రాష్ట్రాన్ని సంప్రదించలేదు 


సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, తమ అభిప్రాయాన్ని కోరాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుని, కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన సందేశాలు ఇవ్వడంతో సమాఖ్య వ్యవస్థలో తప్పులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. 


ఫెడరలిజంపై చర్చ 


హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘దక్షిణ్ డైలాగ్స్’లో భాగంగా ‘భారతదేశం ఫెడరలిజం స్ఫూర్తిని కోల్పోయిందా’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ చర్చలో  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగన్న రాజేంద్రనాథ్ రెడ్డి, తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాల్గొన్నారు. చర్చలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు సమైక్యంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు, దిల్లీ  కేంద్రంగా పాలన సాగిస్తున్న వారి వైఖరి, ఆదరణ లేకపోవడం వంటి పలు అంశాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  


ఆ వైఖరే సరికాదు 


దేశంలో దక్షిణాది రాష్ట్రాల జనాభా 19% ఉందని, జీడీపీలో వారి సహకారం 35% అని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ఖజానాకు తెలంగాణ అందిస్తున్న ప్రతి రూపాయిలో రాష్ట్రానికి కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి వస్తుందన్నారు. రక్షణ, రైల్వేలు వంటి భారత ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి తనకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. “భారత పౌరుడిగా, దేశ నిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉంది. అయితే దిల్లీని నడిపే వారి వైఖరే సమస్య.  మేం ఇచ్చేవాళ్లం, మీరు తీసుకునేవారు,  మేం ఏది చెబితే అది మీరు చేయాలి" అనే వైఖరి సరికాదన్నారు. ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయన్న మంత్రి కేటీఆర్, నిధుల నిర్వహణ విషయంలో ఏం చేయాలో రాష్ట్రాలు ఎందుకు నిర్ణయించుకోకూడదని ప్రశ్నించారు. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులో రాష్ట్రాల వాటా ఎక్కడ వసూలు అవుతుందో?, ఎక్కడ ఖర్చు అవుతుందో?  ఎందుకు ఆలోచించడంలేదని ప్రశ్నించారు.  


Also Read : Shah Security : అమిత్ షా కాన్వాయ్‌కు ఉద్దేశపూర్వకంగానే కారు అడ్డం పెట్టారా? రంగంలోకి ఇంటలిజెన్స్ !


Also Read : CM KCR : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, భూమి లేని వారికి రూ. 10 లక్షల ఆర్థికసాయం - సీఎం కేసీఆర్