KTR Tweet : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా సమస్యపై లేదా సాయం కోసం ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేస్తే ఆయన వెంటనే స్పందిస్తారు. కేటీఆర్ ఆఫీస్ కు ఆదేశాలు ఇస్తూ ఆ సమస్య పరిష్కరించాలని సూచిస్తారు. అలాగే తరచూ ప్రజా సమస్యలపై ఆయన చర్చిస్తుంటారు. టిట్టర్లో ఆస్క్ కేటీఆర్ నిర్వహించి నెటిజన్లకు టచ్ లో ఉంటారు మంత్రి కేటీఆర్. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సు సర్వీసులు అందుబాటులో లేని సమయంలో అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు క్యాబ్ లేదా ఆటో సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు. వాటిని పోలీసులు ట్రాక్ చేసే విధంగా ఉండాలని హర్షిత అనే యువతి ట్విట్టర్ లో కోరారు.    






మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... 


 ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్..  యువతి సూచించిన సమయాల్లో మహిళలకు పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలు లేదా క్యాబ్ లు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్ కు సూచించారు. ట్రాక్ చేసే టెక్నాలిజీ వినియోగించి ఆటోలు ఏర్పాటు చేయాలని, ఈ పద్ధతినే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని డీజీపీని కోరారు. ఈ సూచనపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. మహిళలు సురక్షితమైన ప్రయాణం చేసేలా రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. 






దివ్యాంగుడికి సాయం 


ఆపదలో ఉన్న వారిని  సాయం చేసి మంచి మనసును చాటుకునే మంత్రి కేటీఆర్ ఇటీవల మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. అడిగిన రెండు రోజుల్లోనే ఓ దివ్యాంగుడికి ఆటో అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్ల వంకరపోయాయి. అయితే ఈయనకు పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారే మాధురి, గౌతమి. అయితే కొంతకాలం క్రితమే ఆయన భార్య చనిపోయింది. చేతనైన పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు రోజుల కిందట అంటే ఫిబ్రవరి 28వ తేదీ మంగళవారం రోజు మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చారు. విషయం తెలుసుకున్న నర్సయ్య.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకరాంతో అమాత్యుడిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆటో ఇవ్వాలని నర్సయ్య కోరగా.. మంత్రి కేటీఆర్ ఇస్తానని హామీ ఇచ్చారు. 


అడిగిన రెండ్రోజుల్లోనే ఆటో అందించిన మంత్రి కేటీఆర్


ఈ క్రమంలోనే కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడి ఆటో మంజూరు చేయించారు. ఆయన కోరిన రెండు రోజుల్లోనే నర్సయ్య ఇంటికి ఆటో చేరేలా చేశారు మంత్రి కేటీఆర్. గురువారం రోజు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్త ఆటోను నర్సయ్యకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు అందజేశారు. అయితే అడిగిన వెంటనే స్పందించి తనకు ఆటో అందేలా చేసిన మంత్రి కేటీఆర్ కు నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. తన పిల్లలను కాపాడుకునేందుకు, చక్కగా చదివించేందుకు ఈ ఆటో ఎంతగానో సాయపడుతుందని వివరించారు. తన ఇద్దరు కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని తిప్పాడు.