KTR Letter To Bandi Sanjay :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు అజ్ఞానం, అమాయకత్వంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.  నేతన్నలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నల సంక్షేమం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ స‌ర్కారు చేపట్టిందని తెలిపారు. చేనేత కార్మికులతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఎన్నో  కార్యక్రమాలను చేప‌డుతున్నార‌న్నారు. దేశానికి తెలంగాణ‌ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్‌ తో నేతన్నల సంక్షేమాని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింద‌న్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసి, అప్పుల ఊబి నుంచి కాపాడినట్లు లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీని చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నేతన్నకు చేయూత పేరుతో పొదుపు పథకం కరోనా సమయంలో ఆపన్నహస్తం అందించిందన్నారు. 


ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదు


చేనేతలతో పాటు పవర్‌లూమ్‌ కార్మికులకు కూడా ఆదుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. బండి సంజయ్‌ మళ్లీ నేతన్నలకు పాతరోజులు రావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా వారిని మోసం చేసేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు సాయం అందించాల్సిన కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నద‌ని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు కేంద్రంలోని మంత్రులు, ప్రధాన మంత్రికి లేఖలు రాసినా, స్వయంగా కలిసి నిధులు కేటాయించాలని అడిగిన ఫలితం లేకుండా పోయిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఆర్థిక సహాయం అందించాలని కోరామన్నారు. రాష్ట్రంలో నేషనల్‌ టెక్స్‌ టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు, చేనేత కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ, మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కేంద్రాన్ని ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 


బీజేపీ అవకాశవాదం


బండి సంజ‌య్ పాదయాత్ర పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రజలపై చేస్తున్న దండయాత్ర అని విమర్శించారు. సంజయ్ కపట పాదయాత్రలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత‌ నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామంటున్న బండి సంజయ్‌, కేంద్రంలో అధికారంలో ఉండి ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా అవకాశవాదంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.