Minister KTR Letter : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం కహానీలు చెబుతుందని విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం కేంద్రం బీజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. 


పెట్టుబడుల ఉపసంహరణ సరికాదు 


దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంస్థలను అమ్మడానికి బదులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. తెలంగాణలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న కారణంగా ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన సంస్థలను అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.  


తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్లే


తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోదీ ప్రభుత్వం తన ప్రణాళికల్లో భాగంగా అమ్ముతుందని మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఈ ఆరు సంస్థలకు గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ధరల ప్రకారం కనీసం 5 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ రూ.40 వేల కోట్లు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తుందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేట్ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.