టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఇంటి గోడను అధికారులు అక్రమంగా కూల్చి వేశారని అన్నారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ పార్టీలో బలంగా ఉన్న బీసీ నేతలే లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కేసులు పెట్టడం, నేతల్ని అన్యాయంగా అరెస్టులు చేయడం, దాడులకు పాల్పడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై చోడవరం మినీమహానాడు వేదికగా.. అయ్యన్న పాత్రుడు ప్రశ్నించినందుకే ఈ వేధింపులు చేస్తున్నారని అన్నారు. టీడీపీ అయ్యన్న పాత్రుడు కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి భాగంలో ఉన్న గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చేశారు. అయ్యన్న పాత్రుడు రెండు సెంట్లు స్థలం అక్రమించుకున్నారని ఆరోపణలు రాగా, దానిపై శనివారం రాత్రి టీడీపీ నేత ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయ్యన్న పాత్రుడ్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం కావడంతో నర్సీపట్నంలోని ఆయన ఇంటికి అభిమానులు, పార్టీ కార్యకర్తకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయ్యన్నను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
పోలీసులతో కుటుంబసభ్యుల వాగ్వాదం
మాజీ మంత్రి అయ్యన్న ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు వేసి పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. మరోవైపు సెలవురోజు కావడంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం, పోలీసులు టీడీపీ నేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. శనివారం రాత్రి అయ్యన్న ఇంటికి నోటీసులు పంపించిన అధికారులు, ఆదివారం వేకువజామున రంగంలోకి దిగి అయ్యన్న ఇంటి వెనుక గోడను జేసీబీతో తొలగించేందుకు యత్నం చేశారు. అయితే రాత్రి నోటీసులు ఇచ్చి, తెల్లారే వచ్చి కూల్చివేతలు చేయడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.