Minister Harish Rao : ప్రధాని మోదీ తెలంగాణపై మరోసారి విషాన్ని కక్కడానికి వచ్చారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అదానీ వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కుటుంబ పాలన అంటూ విమర్శలు చేశారన్నారు. పరివారవాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందన్నారు. ప్రధాని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదని, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడానికి వచ్చారని విమర్శించారు. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం మోదీకే చెల్లిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆసరా పింఛన్, రైతు బంధు నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమచేస్తున్నామన్నారు. తన వల్లే డీబీటీ మొదలైనట్టు మోదీ మాట్లాడుతున్నారన్నారు. రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ పెట్టారన్నారు. పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకు లబ్ది అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయం ఎంతని మంత్రి హరీశ్ రావు నిలదీశారు.
కేంద్రమే సహకరించడలేదు
వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత ఇస్తున్నామని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అవాస్తవమని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఐటీఐఆర్‌ను బెంగళూరుకు తరలించారని, తెలంగాణలో పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుచేశారన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించడంలేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే వాస్తవానికి పరిస్థితి రివర్స్‌గా ఉందన్నారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడారు- తలసాని
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్షంగా చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతల కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారని ఆరోపించారు. మోదీకి తెలంగాణపై ప్రేమలేదన్నారు. ఇందుకు గతంలో తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వందే భారత్ రైళ్లను మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మంత్రి తలసాని ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీ... అదానీ అవినీతిపై నోరుమెదపరెందుకని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి కాంట్రాక్టు ఎవరి వల్ల వచ్చిందన్నారు. అదానీ మోసాలపై జేపీసీ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ చర్చకు రావాలని అని మంత్రి తలసాని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం పిలిచి మరీ ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందో లేదో మోదీ చెప్పాలన్నారు.